జగన్ సన్నిహిత ఎమ్మెల్సీ జనసేనలోకి?
వైసీపీలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితిగా ఉంది. నమ్మి పదవులు ఇచ్చినా పార్టీని వీడిపోతున్నారు
వైసీపీలో ఏమి జరుగుతుందో ఎవరికీ అర్ధం కాని పరిస్థితిగా ఉంది. నమ్మి పదవులు ఇచ్చినా పార్టీని వీడిపోతున్నారు. పదవులతో పాటుగా పార్టీకి దూరం అవుతున్నారు. రాజ్యసభలో ముగ్గురు వైసీపీ ఎంపీలు ఈ విధంగానే వైసీపీ ఓటమి తరువాత వీడి వెళ్లారు. మరో వైపు చూస్తే శాసనమండలిలో ఇదే తీరు కొనసాగుతోంది.
శాసనమండలిలో బలమైన పార్టీగా వైసీపీ ఉంది. ఆ పార్టీకి మెజారిటీ అక్కడ ఉంది. దాంతో కూటమి ఆపరేషన్ ఆకర్ష్ ని చేపట్టింది. ఇక అదే బాగుందని అధికార పార్టీలోకి ఎమ్మెల్సీలు వైసీపీ నుంచి క్యూ కడుతున్నారు. అలా చూసుకుంటే ఇప్పటికి అయిదురుగు ఎమ్మెల్సీలు వైసీపీకి రాజీనామా చేశారు.
వారి రాజీనామాలు పెండింగులో చైర్మన్ కొయ్యే మోషెన్ రాజు వద్ద ఉన్నాయి. ఇపుడు మరో పేరు ఎమ్మెల్సీ జంపింగ్ అంటూ జోరుగా వినిపిస్తొంది. ఆయన గుంటూరు జిల్లా గురజాలకు చెందిన చంద్రగిరి ఏసురత్నం అని పుకారులు షికార్లు చేస్తున్నాయి. ఆయన సీనియర్ మోస్ట్ పోలీసు అధికారి. డీఐజీ స్థాయిలో పనిచేసి 2018లో వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని వైసీపీలో చేరారు. ఆయనకు జగన్ గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ ఇచ్చారు. అయితే ఆయన ఓటమి పాలు అయ్యారు.
ఇక వైసీపీ అధికారంలోకి వచ్చాక గుంటూరు మార్కెట్ యార్డు చైర్మన్ పదవి ఇచ్చారు. 2023లో ఆయనకు ఎమ్మెల్సీ పదవి లభించింది. 2029 దాకా ఆయన పదవీ కాలం ఉంది. అయితే ఇపుడు వినిపిస్తున్న మాట ఏంటి అంటే ఏసురత్నం వైసీపీని వీడి జనసేనలో చేరుతారు అని. ఈ మేరకు ఆయన ఒక డెసిషన్ తీసుకున్నారు అని తన క్యాడర్ ని ఆ దిశగా మళ్ళించేందుకు వారికి కూటమి పాలన గురించి తరచూ మెచ్చుకోలుగా చెబుతున్నారని అంటున్నారు.
కూటమి పాలన భేష్ అని ఆయన పొగుడుతున్నారు అని అంటున్నారు. ఆయన ఆలోచనలు ఏంటి అంటే జనసేనలో చేరి రానున్న రోజులలో మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అంటున్నారు. అంతవరకూ బాగానే ఉంది కానీ చేతిలో నాలుగేళ్లకు పైగా పదవీకాలం ఉండగా ఎందుకు ఈ జంపింగులు అన్న చర్చ కూడా వస్తోంది. 2029 దాకా ఆయనకు ఎటూ చట్ట సభలలో అవకాశం ఉంది కదా అని అంటున్నారు
అయితే ఇప్పటి నుంచే వెళ్తే అధికార పార్టీలో ఉండవచ్చు అన్నది ఒకటి ఉంది. అలాగే తనకు కావాల్సిన సీటుని కూడా చూసుకుని బెర్త్ ని ముందే కన్ ఫర్మ్ చేసుకోవచ్చ్చు అన్నది కూడా ఆయన ఆలోచన అని చెబుతున్నారు. మరి ఈ పుకార్లు నిజం అవుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా వైసీపీలో చేరి అనేక పదవులు పొందిన వారు కూడా పార్టీకి గుడ్ బై కొడితే మాత్రం ఎవరిని నమ్మాలి ఏమి చేయాలి అన్నది అసలు అర్ధం కాదని అంటున్నారు ఫ్యాన్ పార్టీలో దీని మీదనే చర్చ అయితే సాగుతోంది అని అంటున్నారు.