జనం కోసం.. పవన్ ని పిలిచారా?

నారా లోకేష్ "యువగళం" పాదయాత్ర ముగింపు సందర్భంగా చేపట్టిన సభ పోలిపల్లిలో జరిగిన సంగతి తెలిసిందే

Update: 2023-12-21 12:19 GMT

నారా లోకేష్ "యువగళం" పాదయాత్ర ముగింపు సందర్భంగా చేపట్టిన సభ పోలిపల్లిలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్ లు పదేళ్ల తర్వాత ఒకే బహిరంగ వేదికపై కనిపించారు! ఈ సందర్భంగా ప్రసంగించిన చంద్రబాబు... ఉచిత హామీల వర్షం కురిపించారు. ఇది ట్రైలర్ మాత్రమే.. అసలు మేనిఫెస్టోలో మొత్తం ఉంటుందన్నట్లుగా చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారంపై ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.

అవును... తాజాగా పోలిపల్లిలో జరిగిన సభా వేదికపై ప్రసంగించిన చంద్రబాబు, పవన్ లు ఏపీ సర్కార్ పై చేసిన విమర్శలపై సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. ఇందులో భాగంగా... చంద్రబాబు, పవన్ కల్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. అదే సమయంలో వైసీపీ ఇన్ ఛార్జ్ ల మార్పు, చేర్పులపైనా స్పష్టత ఇచ్చారు. ఇదే సమయంలో ఈ సభకు హాజరవ్వాలని పవన్ ను బ్రతిమాలి మరీ తీసుకొచ్చింది జన సమీకరణ కోసమా అని తనదైన శైలిలో ప్రశ్నించారు!

ఈ క్రమంలో తాజాగా చంద్రబాబు హామీలు ఇవ్వడంపై సజ్జల మండిపడ్డారు. చంద్రబాబు ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చినట్లు, కొత్త పార్టీ ఇచ్చే హామీలుగా మాట్లాడుతున్నారని అన్నారు. ఇక జన్మభూమి కమిటీ పేరు వినగానే జనానికి భయం పడుతోందని సజ్జల ఎద్దేవా చేశారు. అసలు చంద్రబాబు పాలనలో ఏం చేసారో చెప్పాలని ఈ సందర్భంగా సజ్జల నిలదీసారు. 2014-19 మధ్య చంద్రబాబు తెచ్చిన స్కీములు ఉన్నాయా అని ప్రశ్నిస్తూ.. ఆయన హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని అన్నారు.

ఇదే సమయంలో... చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఏపీలో అడ్రస్ లేదని విమర్శించిన ఆయన... వారిద్దరి మధ్యా తెర వెనుక జరిగిన ఒప్పందాలను ప్రజలకు వివరించాలని డిమాండ్ చేసారు. ఏపీలో చంద్రబాబు, ఆయనకు మద్దతు ఇచ్చే మీడియా తప్ప ప్రజలెవరు జగన్ ను మార్చాలని అనుకోవటం లేదని స్పష్టం చేశారు.

ఇక టీడీపీని లాక్కున్నారు.. పవన్‌ కి ఎదురు డబ్బు ఇచ్చి తెచ్చుకున్నారు.. అది తప్ప ఏపీ ప్రజలకు ఏం చేశారో చెప్పలేరని ఎద్దేవా చేసిన సజ్జల... వైసీపీ నుంచి ఎవరూ పక్కకు వెళ్లే అవకాశం లేదని.. అసలు టీడీపీ, జనసేన మధ్యే సరిగా పొంతనలేదని అన్నారు. ప్రధానంగా... చంద్రబాబుకు దీర్ఘకాలిక మద్దతు అని అంటున్న పవన్... మరి సొంతంగా పార్టీ పెట్టుకోవటం ఎందుకని సజ్జల ఎద్దేవా చేసారు.

ఇలా... పవన్‌ కల్యాణ్‌ రాకపోతే తమ మీటింగ్‌ కి జనం రారనుకునే స్థితికి చంద్రబాబు వెళ్లారని ఎద్దేవా చేసిన ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి... వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాల లెక్కలు కూడా చెప్పారు. ఇందులో భాగంగా... జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరున్నర లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చారని స్పష్టం చేశారు.

Tags:    

Similar News