ముహూర్తం ఫిక్సయితే అంతేనట.. వైవీ మాట..!
వైసీపీ కీలక నాయకుడు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి తేల్చి చెప్పేశారు
వైసీపీ కీలక నాయకుడు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి మరోసారి తేల్చి చెప్పేశారు. వచ్చే దసరా నుంచి విశాఖపట్నం పాలనా రాజధానిగా మారుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే.. ఆయన చేసిన వ్యాఖ్య లు కొత్తేంకాదు. గతంలోనూ సీఎం జగన్ ఒక నెల ముందుకే చెప్పారు. అంటే.. సెప్టెంబరులోనే తన కాపురాన్ని విశాఖకు షిఫ్ట్ చేసుకుంటానన్నారు. ఇప్పుడు మరోసారి ఇదే విషయాన్ని వైవీ చెప్పుకొచ్చారు.
అయితే.. ఈసారి ముహూర్తం మరికొంత ఆలస్యమైంది. అయితే.. ఈ సారి కూడా ఈ విషయంలో గ్యారెంటీ లేదనే టాక్ పార్టీలోనే వినిపిస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. ఒకవైపు మూడు రాజధానుల వ్యవహా రంపై కోర్టులో కేసులు నడుస్తున్నాయి. అందుకే.. తెలివిగా సీఎంజగన్ తన కాపురాన్ని మార్చుకుంటున్నట్టు ప్రకటించారు. కానీ, వైవీ మాత్రం ఒకింత ఆవేశ పడ్డారనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే.. రాజధానుల విషయంలో ఇంకా తీర్పు రాకముందే.. పాలనా రాజధాని విశాఖలో ప్రారంభం కావడం ధిక్కారమే అవు తుంది.
అయినప్పటికీ.. వైవీ మాత్రం మాట అనేశారు. ఇక, పాలనాపరంగా చూస్తే.. సీఎం ఎక్కడ ఉంటే అక్కడ నుంచే పాలన జరుగుతుందనే వితండ వాదన చేసేవారు కూడా ఉన్నారు. కానీ, ప్రభుత్వం అంటే.. సీఎస్ నుంచి ఇతర అధికారులు, కార్యాలయాలు ఉండాల్సిన అవసరం ఉంది. అదేసమయంలో ప్రజలు వచ్చేందుకు.. సమస్యలు పరిష్కరించే యంత్రాంగం కూడా అక్కడే ఉండాల్సి ఉంటుంది. ఇవేవీ లేకుండా పాలన రాజధాని అంటూ ప్రకటించినా.. అది రాజకీయమే అవుతుంది తప్ప.. మరొకటి కాదు.
ఈ నేపథ్యంలో వైవీ చేసిన ప్రకటన ప్రాధాన్యం లేకుండా పోయిందనే వాదన వినిపిస్తోంది. ఇక, మరోవైపు కేసుల ఉచ్చు నుంచి కూడా ప్రభుత్వం బయటకు రాలేదు. ఇవన్నీ తేలేందుకు మరికొంత గడువు అయితే ఉంటుంది. అయితే, ఎన్నికలకు సమయం మించిపోతున్న సమయంలో ఇప్పుడైనా కదలిక లేక పోతే.. మూడు రాజధానుల విషయం తేలకపోతే.. ఇబ్బంది తప్పదనేది వైసీపీ నాయకుల వాదన. మరి ఏం చేస్తారోచూడాలి.