మురుగు నది ఒడ్డున ప్రపంచ క్రీడా సంగ్రామం.. పారిస్ పరువు పాయె

దీనికి కారణం.. మురుగుకూపంలా మారిన నది ఒడ్డున ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారనే పేరు రావడం.

Update: 2024-07-20 01:30 GMT

పారిస్ అంటే ప్రపంచ ఫ్యాషన్ రాజధాని.. అక్కడ గంటకో ఫ్యాషన్ పుడుతుందనే పేరు.. ఇక ఫ్రాన్స్ అంటేనే అత్యంత సుందరమైన దేశం అంటారు.. అలాంటిచోట మొన్నటివరకు రాజకీయాలు గందరగోళంగా ఉన్నాయి. అధ్యక్షుడు మేక్రన్ ముందస్తు ఎన్నికలకు వెళ్లి భంగపడ్డారు. అదంతా సద్దుమణిగి ఈ నెల 26 నుంచి ఒలింపిక్స్ కు వేదిక కాబోతోంది. కానీ.. ఈ వేడుకల తేదీలు దగ్గరపడేకొద్దీ నిర్వాహకుల్లో ఒకటే టెన్షన్‌. దీనికి కారణం.. మురుగుకూపంలా మారిన నది ఒడ్డున ఒలింపిక్స్ నిర్వహిస్తున్నారనే పేరు రావడం.

మరో మూసీ.. సియోన్..

పారిస్ లోని సియోన్‌ నదికి మురుగు నదిగా పేరు. ఇప్పటికే జోరుగా వర్షాలు పడుతున్నా, ఎన్ని చర్యలు చేపట్టినా ఆ నది తీరు మారడం లేదు. దీంతో ఒలింపిక్స్ లో కొన్ని పోటీలు నిర్వహించే పరిస్థితి లేకుండా పోనుంది. ఒక్క మాటలో చెప్పాలంటే మన మూసీలాంటి నది సియోన్. అత్యంత పురాతన భారీ మురుగు నీటి పారుదల పైపులు సియోన్ లో కలుస్తున్నాయి. ట్రీట్ మెంట్ ప్లాంట్లలోకి చేరక ముందే నది నీరు పూర్తిగా కలుషితం అవుతోంది. వాన, మురుగు కలిసి పారుతూ సియోన్ ను మురుగు కూపంగా చేస్తున్నాయి. అంతేకాదు.. మనుషులు, జంతు వ్యర్థాలు ఈ నదిలోనే కలుస్తున్నాయి. సియోన్ అంటే.. ఓ అతిపెద్ద మురుగు కాల్వ అనుకోవాలేమో? ఈ-కోలీ బ్యాక్టీరియాతో అత్యంత తీవ్రంగా ఉంటుంది. ఇందులోని కొన్ని రకాల క్రిములు యూరినరీ, జీర్ణ కోశ జబ్బులకు దారితీస్తాయి.

వందేళ్ల కిందటనే నిర్వహించలేదు..

పారిస్ 1923లో అంటే 101 ఏళ్ల కిందట ఒలింపిక్స్ కు ఆతిథ్యం ఇచ్చింది. అప్పట్లోనే కాలుష్యంతో సియోన్ లో ఈత పోటీలు నిషేధించారు. 2024లో నూ ఇదే పరిస్థితి వస్తుందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి 100 మిల్లీలీటర్ల నీటిలో 900 కాలనీ ఫార్మింగ్‌ యూనిట్ల ఈకోలీ బ్యాక్టీరియా ఉన్నా ఈత పోటీలు నిర్వహించవచ్చు. అయితే, గత నెల 30న పారిస్ లో భారీ వర్షాలు కురిశాయి. దీంతో బ్యాక్టీరియా బాగా పెరిగింది. బ్యాక్టీరియా 10 వేల కాలనీ ఫార్మింగ్‌ యూనిట్లకు చేరింది. కాగా, ఈ నెల 26న మొదలయ్యే ఒలింపిక్స్ లో 30, 31, ఆగస్టు 5వ తేదీల్లో సియోన్ నదిలో ట్రయాథ్లాన్‌ పోటీలను, మారథాన్‌ స్విమ్మింగ్‌ ఈవెంట్‌ ను ఆగస్టు 8, 9 తేదీల్లో నిర్వహిస్తారు. దీనికి 48 గంటల ముందు నీటి పరీక్షలు చేపట్టనున్నారు. వాటిలో సియోన్‌ నది ప్రమాణాలను అందుకుంటుదని చెప్పలేం అంటున్నారు.

12 వేల కోట్లు పెట్టినా..

సియోన్‌ నది ప్రక్షాళనకు ఫ్రాన్స్ రూ.12 వేల కోట్లు ఖర్చుపెట్టింది. ఈ నది సురక్షితమే అని చెప్పేందుకు పారిస్‌ మహిళా మేయర్‌ అన్నే హిడాల్గో అందులో ఈత కొట్టారు. ఫ్రాన్స్‌ క్రీడా మంత్రి క్యాస్టెరా కూడా ఈత కొట్టారు. వీరేంటే సరి.. మరి ప్రొఫెషనల్స్ ఒలింపియన్లకూ సియోన్ లో ఈత కొట్టడం ఇష్టం ఉండాలిగా..?

Tags:    

Similar News