పులివెందుల కుప్పం కూడా.. ఆ జాబితాలో చేరిపోయాయా?!

మరో ఆరు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్

Update: 2023-07-14 06:31 GMT

మరో ఆరు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే ఏపీపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటి నుంచే డేగకన్ను సారించినట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఒకప్పుడు సమస్యాత్మక నియోజకవర్గాలు అని.. ఓ 20 నుంచి 30 నియోజకవర్గాలను ఎన్నికల సంఘం ప్రకటించేది. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలకు ముందు.. తర్వాత కూడా కొన్ని రోజులు జాగ్రత్తలు తీసుకునేవారు. అనుమానితులను అరెస్టు కూడా చేసేవారు.

ఇది.. గత ఎన్నికల వరకు ఉన్న విధానం. కానీ తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాలను సమస్యాత్మకమైనవిగా పేర్కొనే అవకాశం ఉందని తెలుస్తోంది. వీటిలో సీఎం జగన్ ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల టీడీపీఅ ధినేత చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం వంటివి కూడా ఉన్నాయని తెలుస్తోంది.

అదేవిధంగా మరో 50 నుంచి 60 నియోజకవర్గాలను కూడా ఈ జాబితాలో చేర్చి.. ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలను నిశితంగా గమనించే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది.

రాష్ట్రంలో నకిలీ ఓట్ల వ్యవహారం తెరమీదికి రావడం.. టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాసి ఫిర్యాదు చేయడం.. ఇతర పార్టీల నుంచి కూడా అభ్యర్థనలు వచ్చిన దరిమిలా.. కేంద్ర ఎన్నికల సంఘం.. నిశితంగా ఏపీపై దృష్టిపెట్టినట్టు సమాచారం. దీంతో వచ్చే ఎన్నికలు అత్యంత పక్కాగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా చెబుతున్నారు.

మరోవైపు డిజిటల్ రాజకీయం పెరిగిపోయి.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం.. దుర్భాషలాడుతుండ డంపైనా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందినట్టు సమాచారం. ఈ క్రమంలో యూట్యూబ్ సహా.. సోషల్ మీడియాను కూడా నియంత్రించే అవకాశాలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి పెట్టినట్టు సమాచారం.

ఈ విషయంలో ఒక్క ఏపీలోనే కాకుండా.. రాజస్థాన్.. తదితర వచ్చే కొద్ది నెల్లలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లోనూ నియంత్రించనున్నట్టు సమాచారం. మొత్తానికి ఎన్నికలను ప్రక్షాళన చేసే దిశగా వేస్తున్న అడుగులు ఏమేరకు ఫలిస్తాయో చూడాలి.

Tags:    

Similar News