ఆ దేశంలో పది లక్షల మంది భారతీయులకు చిక్కులు!

అమెరికాలో 1.2 మిలియన్ల మంది భారతీయులు చిక్కులు ఎదుర్కొంటున్నారు.

Update: 2024-09-05 07:33 GMT

అమెరికాలో 1.2 మిలియన్ల మంది భారతీయులు చిక్కులు ఎదుర్కొంటున్నారు. అమెరికాలో చట్టబద్ధమైన భారతీయ వలసదారులకు 2,50,000 మంది పిల్లలున్నారు. వీరిలో చాలామంది భారతీయ అమెరికన్లు. వీరిలో 21 ఏళ్ల వయసు వచ్చినవారు ఆ దేశం నుంచి బహిష్కరణ ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు.

ఉద్యోగాల కోసం హెచ్‌1 బీ వీసాలపై వచ్చిన భారతీయులు అమెరికాలో సెటిల్‌ అయ్యారు. వీరిలో కొందరు గ్రీన్‌ కార్డు (శాశ్వత నివాసానికి ఇచ్చే గుర్తింపు) పొందారు. అయితే వారి సంతానంలో కొందరికి గ్రీన్‌ కార్డు లేదు. ఇలా తాత్కాలిక ఉద్యోగ వీసాలపై తమ తల్లిదండ్రులతోపాటు వచ్చిన పిల్లలు వారికి 21 ఏళ్లు వయసు వచ్చే లోపు గ్రీన్‌ కార్డు పొందాల్సి ఉంది. లేదంటే వారిని అమెరికాలో అక్రమంగా ఉంటున్న వారిగా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో వారిని దేశం నుంచి బహిష్కరించే ప్రమాదం ఉంది.

గ్రీన్‌ కార్డులు లేని పిల్లలు తమ డిపెండెంట్‌ స్టేటస్‌ ను కోల్పోతారు. 21 ఏళ్ల వయసు వచ్చే లోపు గ్రీన్‌ కార్డును పొందకపోతే అమెరికాను వదిలేయాల్సి ఉంటుంది. డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌ గా పిలువబడే తమ పిల్లల గ్రీన్‌ కార్డుల కోసం ప్రస్తుతం అమెరికాలో 1.2 మిలియన్ల మంది భారతీయులు ఎదురుచూపులు చూస్తున్నారు.

అమెరికా చట్ట నిబంధనల ప్రకారం.. పిల్లలను ‘‘అవివాహితుడు/ 21 ఏళ్లలోపు’’ అని నిర్వచించారు. గ్రీన్‌ కార్డ్‌ పొందడానికి ముందే వారికి 21 ఏళ్లు నిండిపోతే వారిని పిల్లలుగా పరిగణించారు. దీంతో వారు పెద్దల కేటగిరీలోకి వస్తారు. దీంతో గ్రీన్‌ కార్డుకు అనర్హులు కావచ్చు.

ఈ నేపథ్యంలో డాక్యుమెంటెడ్‌ డ్రీమర్స్‌ (గ్రీన్‌ కార్డును కోరుకునే పిల్లలు) తమ సమస్యను పరిష్కరించమని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్‌ను కోరారు. ప్రస్తుతం ఈ పిల్లలంతా హెచ్‌4 వీసాలపై అమెరికాలో ఉన్నారు. వారి తల్లిదండ్రులకు హెచ్‌1బీ వీసాలు ఉండటంతో వారిపై పిల్లలు ఆధారపడ్డారు.

ఈ పిల్లలకు 21 ఏళ్లు నిండిపోతే పిల్లల హోదాను కోల్పోతారు. సామాజిక భద్రత సంఖ్య (ఎస్‌ఎస్‌ఎన్‌) కోల్పోతారు. చదువుకోవడానికి ఆర్థిక సహాయం పొందడంలోనూ ఇబ్బందులు తప్పవు. దీంతో వారు విద్యార్థి వీసా లేదా ఉద్యోగ వీసా లేదా మరొక వీసాకు మారకపోతే దేశంలో అక్రమంగా ఉంటున్నవారిగా గుర్తిస్తారు. ఈ నేపథ్యంలో తమ సమస్యను పరిష్కరించాలని జో బిడెన్‌ కు విన్నవించారు. తమకు ఉద్యోగ గుర్తింపు పత్రాలు మంజూరు చేయాలని కోరుతున్నారు.

హెచ్‌ 1 బి వీసా హోల్డర్లలో ఎక్కువ భాగం ఉన్న భారతీయ పౌరులు ముఖ్యంగా గ్రీన్‌ కార్డ్‌ బ్యాక్‌ లాగ్‌ వల్ల ప్రభావితమవుతారు.

1.2 మిలియన్ల మంది భారతీయులు గ్రీన్‌ కార్డ్‌ ల కోసం ఎదురుచూస్తున్నారు, వార్షిక పరిమితులు, ఇతర పరిమితుల కారణంగా చాలామంది వాటిని పొందడానికి చాలా ఏళ్ల సమయం పడుతుంది.

Tags:    

Similar News