అవును.. ‘‘తాజ్’’ .. హౌస్ ఫుల్

Update: 2015-12-29 04:40 GMT
గతానికి.. వర్తమానికి సంబంధించి ఒక మార్పు కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. గతంలో వరుస సెలవులు వచ్చినా ఇళ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితులు పెద్దగా ఉండేవి కాదు. కానీ.. గత దశాబ్ద కాలంలో చాలానే మార్పు వచ్చింది. ఏ మాత్రం సెలవు వచ్చినా.. చుట్టుపక్కల ప్రదేశాల నుంచి.. దూరప్రాంతాలకు ప్రయాణం అయ్యేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో దేశ వ్యాప్తంగా ప్రయాణాలు భారీగా పెరిగాయి.

కాస్త సెలవు చిక్కితే బయటకు వెళ్లేందుకు విపరీతమైన ప్రాధాన్యత ఇవ్వటం ఈ మధ్యన పెరిగింది. గత వారం శుక్ర.. శని.. ఆదివారాల్లో వరుస సెలవులు రావటంతో అగ్రాలోని తాజ్ మహాల్ లో ఒక చిత్రమైన పరిస్థితి నెలకొంది. ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ ను చూసేందుకు టిక్కెట్లు కొన్న పర్యాటకుల్ని లోపలికి అనుమతించకుండా నిలిపేశారు.

భారీగా సందర్శకులు రావటంతో ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఎప్పుడూ లేనంత భారీగా ఈ మూడు రోజుల్లో పర్యాటకులు తాజ్ ను  సందర్శించటానికి వచ్చినట్లు చెబుతున్నారు. పర్యాటకులతో తాజ్ కిక్కిరిసిపోవటంతో టిక్కెట్లు ఉన్న 2వేల మందిని లోపలకు అనుమతించకుండా నిలిపివేసిన పరిస్థితి. వీవీఐపీలు.. వీఐపీలు.. 15 ఏళ్ల  కంటే తక్కువ ఉన్న వారు కాకుండా.. ఒక్క శనివారం 49,053 మంది తాజ్ ను దర్శించుకున్నట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News