షాకింగ్: గుడిసెకు రూ. 41 వేల కరెంటు బిల్లు !

Update: 2020-05-15 07:30 GMT
వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి లాక్ డౌన్ అమలు చేస్తున్న సమయంలో  విద్యుత్ చార్జీలు పెద్ద తలనొప్పిగా మారింది. కొన్ని చోట్లల్లో వాడుకున్న దానికంటే ఎక్కువ విద్యుత్ చార్జీలు వస్తూ షాకులు ఇస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చోట్ల బిల్లులు ఎక్కువగా రావడంతో అందరిలో ఆందోళన మొదలైంది.  తాజాగా ఇలాంటి సంఘటనే ఏపీలోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం దేవదొడ్డి గ్రామంలో బీడీలు చేసుకుంటూ ఛాన్వి అనే మహిళ కుటుంబాన్ని పోషించుకుంటోంది. అయితే ఆమెకి ఏకంగా రూ.41 వేల కరెంటు బిల్లు వచ్చింది. దీనితో బాధితురాలు అవాక్కయ్యింది .

కేవలం రెండు లైట్లు, రెండు ఫ్యాన్లు, టీవీ ఉన్న ఓ గుడిసెకు ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్ చార్జీలు రావడం ఏంటి అని ఆశ్చర్యపోయింది. అయితే ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా వారు మాత్రం విద్యుత్ వినియోగించిన దానికంటే ఒక్క యూనిట్ ‌కి కూడా ఎక్కువ బిల్లు వేయలేదని చెబుతున్నారు. ఇలాంటి తరహా సంఘటనలు మరికొన్ని చోట్లలో కూడా చోటు చేసుకున్నాయి. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్‌ పరిధిలోని ఐదు జిల్లాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సమీపంలోని ఓ గ్రామంలో పూరి గుడిసెలో ఉండే ఓ కుటుంబానికి రూ.17 వేలు, మరో కాలనీలో రేకుల షెడ్డులో ఉంటున్న కుటుంబానికి రూ.28 వేల బిల్లు వచ్చింది. దీనితో వారు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు.

అయితే విద్యుత్తు అధికారులు మాత్రం మీటర్‌ రీడింగ్‌ సేకరణ, బిల్లుల తయారీలో ఎలాంటి లోపాలు లేవని, వినియోగించిన దానికే ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు వెల్లడించారు. లాక్ డౌన్ సమయంలోనే కాదు.. అంతకుముందు కూడా ఇలాంటి సంఘటనలు చాలా చోటుచేసుకున్నాయి. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సమస్య ఉత్పన్నం అవుతుండటం తో ఏపీ  సీఎం జగన్ మోహన్ రెడ్డి జూన్ 30 వరకు కరెంటు బిల్లును వాసులు చేయవద్దు అని పంపిణీ సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. లాక్‌ డౌన్ సమయంలో వేలకు వేలు కరెంట్ బిల్లులు రావడంతో ప్రజలు ప్రభుత్వంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ బిల్లుల చెల్లింపును జూన్ 30వ తేదీ వరకూ వాయిదా వేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది.
Tags:    

Similar News