సీలు వేసిన వూహాన్ సిటీ నుంచి 50 లక్షల మంది వెళ్లిపోయారు

Update: 2020-01-28 05:22 GMT
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అంతకంతకూ విస్తరిస్తోంది. అగ్రరాజ్యమైన చైనా ఎంతగా ప్రయత్నిస్తున్నా.. ఈ వైరస్ విస్తరణను మాత్రం నిలువరించలేకపోతోంది. సోమవారం నాటికిఈ వైరస్ బారిన పడి 81 మంది మరణించగా.. 2744 మందికి ఈ వైరస్ సోకినట్లుగా ప్రకటించారు. వీరిలో 461 మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. కరోనా వైరస్ తొలిసారి వెలుగు చూసిన వూహాన్ నగరాన్ని చైనా ప్రధాని తాజాగా సందర్శించారు. తీసుకుంటున్న చర్యల్ని పర్యవేక్షించారు.

బాధితులు ఉన్న ఆసుపత్రులను తనిఖీ చేసిన ప్రధాని లీ కెక్వింగ్.. పలు ఆదేశాలు జారీ చేశారు. చైనాలో వెలుగు చూసిన కరోనా వేగంగా విస్తరిస్తూ పలు దేశాలకు వ్యాపిస్తోంది. తాజాగా థాయి లాండ్.. జపాన్.. దక్షిణ కొరియా.. అమెరికా.. వియత్నాం.. సింగపూర్.. మలేషియా.. నేపాల్.. ఫ్రాన్స్.. ఆస్ట్రేలియాల్లో కూడా ఈ వైరస్ ను గుర్తించారు.

ఈ వైరస్ ను కట్టడి చేసేందుకు చైనా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. వూహాన్ తో సహా దాదాపు పన్నెండు నగరాల నుంచి చైనాలోని ఇతర ప్రాంతాలకు రవాణా సౌకర్యాల్ని బంద్ చేశారు. వ్యక్తిగత ప్రయాణాల్ని నిలిపివేశారు. ఒక విధంగా ఆ నగరాలకు సీల్ వేశారు. ఆసక్తికరమైన విషయం ఏమంటే.. కరోనా వైరస్ వెలుగు చూసిన తొలినాళ్లలోనే వూహాన్ నగరం నుంచి ఏకంగా యాభై లక్షల మంది వివిధ ప్రాంతాలకు తరలి పోయినట్లు గా చెబుతున్నారు. ఈ నగర జనాభా కోటి పది లక్షలు కాగా.. అందులో యాభై లక్షల మంది వివిధ ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇంత భారీగా వెళ్లిపోవటం వల్లనే.. ఈ ప్రమాదకర వైరస్ వివిధ ప్రాంతాలకు విస్తరించిందని చెప్పక తప్పదు. రవాణా సౌకర్యాల పై నిషేధం విధించటానికి కాస్త ముందు గానే భారీ ఎత్తున వూహాన్ నగర ప్రజలు వెళ్లి పోయినట్లుగా తెలుస్తోంది.


Tags:    

Similar News