లీకేజీ స‌రే... ప్యాకేజీ ఎంతో చెప్పాల‌ట‌!

Update: 2017-07-18 12:03 GMT
న‌వ్యాంధ్ర నూత‌న రాజ‌ధాని అమ‌రావ‌తి ప‌రిధిలోని తాత్కాలిక అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయం, తాజాగా వెల‌గ‌పూడిలోని తాత్కాలిక స‌చివాలయంలో చోటుచేసుకున్న లీకేజీల‌ను అస్త్రంగా చేసుకుని వైసీపీ కీల‌క నేత‌, గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరి ఎమ్మెల్యే ఆళ్ల రామ‌కృష్ణారెడ్డి (ఆర్కే) చంద్ర‌బాబు స‌ర్కారును ఓ ఆటాడేసుకున్నారు. గ‌తంలో అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయంలోని వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఛాంబ‌ర్‌లో చోటుచేసుకున్న లీకేజీలకు అనుమానాలు వ్య‌క్తం చేసిన స‌ర్కారు సీఐడీ విచార‌ణ‌కు ఆదేశాలు జారీ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే నాడు కూడా ప్ర‌భుత్వం ద‌మ‌న నీతితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆరోపించిన ఆర్కే... ఒక్క జ‌గ‌న్ ఛాంబరే కాకుండా అసెంబ్లీ భ‌వ‌న స‌ముదాయంలోని మిగిలిన ఛాంబ‌ర్ల‌లోనూ లీకేజీలు ఉన్నాయ‌ని, అయితే ప‌రువు గంగ‌లో క‌లిసిపోతుంద‌న్న భావ‌న‌తోనే ప్ర‌భుత్వం వాటిని దాచేసి... ఒక్క జ‌గ‌న్ ఛాంబ‌ర్‌ ను మాత్ర‌మే మీడియాకు చూపింద‌ని ఆరోపించారు.

అయితే నాడు ఆర్కే చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ప్ర‌భుత్వం నుంచి స‌మాధానం వ‌చ్చిన దాఖ‌లాలే లేవు. తాజాగా స‌చివాలయంలోని మంత్రులు దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావు, గంటా శ్రీనివాస‌రావుల ఛాంబ‌ర్ల‌లో లీకేజీలు చోటుచేసుకున్న ఘ‌ట‌న‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి. వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేసి నిర్మించిన తాత్కాలిక అసెంబ్లీ, స‌చివాల‌యం..  రెండూ నాసిర‌కంగానే క‌ట్టిన భ‌వ‌నాలేన‌న్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీనిపై వివ‌ర‌ణ ఇచ్చేందుకు మీడియా ముందుకు వ‌చ్చిన మంత్రి నారాయ‌ణ‌... చిన్న చిన్న లీకేజీలు స‌ర్వ‌సాధార‌ణ‌మ‌ని, రెండేళ్ల పాటు లేకేజీలు, చిన్న చిన్న లోపాల‌ను నిర్మాణ సంస్థ‌లే స‌రిచేస్తాయ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత మీడియా ముందుకు వ‌చ్చిన ఆర్కే... నారాయ‌ణ వ్యాఖ్య‌ల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒక్క నారాయ‌ణ వ్యాఖ్య‌ల‌పై మాట్లాడ‌టంతోనే స‌రిపెట్టని ఆర్కే.. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై చంద్ర‌బాబు స‌ర్కారును క‌డిగిపారేశారు. ఇప్పుడు వ‌చ్చిన లీకేజీల‌ను నిర్మాణ సంస్థ‌ల నుంచి ప్ర‌భుత్వ పెద్ద‌ల‌కు అందిన ప్యాకేజీల‌తో ముడిపెట్టి ఆర్కే సంధించిన విమ‌ర్శ‌లు క‌ల‌క‌లం రేపుతున్నాయి.

లీకేజీల వ్యవహారం చాలా చిన్నదని మంత్రి నారాయణ చెబుతున్నారని, దాన్ని భూతద్దంలో పెట్టి చూడవద్దనడం సబబు కాదని ఆయ‌న‌ అన్నారు. లీకేజీ చిన్న విషయమైనా మీకు అందిన ప్యాకేజీ ఎంతో చెప్పాలని ఆర్కేఎద్దేవా చేశారు. గతంలో జగన్ ఛాంబర్ లోకి నీళ్లు లీకేజీ అయినప్పుడు ప్రభుత్వం పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా మంత్రుల ఛాంబర్లకే చిల్లులు పడ్డా మంత్రి గారికి చిన్న విషయంగా అనిపిస్తోందని మండిపడ్డారు. అమరావతి సచివాలయ నిర్మాణంలో జరిగిన అవినీతిని సీఐడితో కాదు సీబీఐతో విచారణ చేయించాలని ఆయ‌న‌ డిమాండ్ చేశారు. రైతుల నుంచి ఉచితంగా భూమి తీసుకుని, ఉచితంగా వచ్చిన ఇసుకతో చదరపు అడుగు నిర్మాణానికి రూ.10,000 చొప్పున మొత్తం 1000 కోట్లు చెల్లించి నిర్మాణాలు చేపడితే ఒక్క వర్షానికే ఇన్ని లీకులా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. అస‌లు నిర్మాణ సంస్థ‌ల నుంచి మీకెంత ప్యాకేజీ అందిందో తెల‌పాలంటూ ఆర్కే సంధించిన ప్ర‌శ్న‌ల‌కు టీడీపీ స‌ర్కారు, మంత్రి నారాయ‌ణ నుంచి ఎలాంటి స‌మాధానం వ‌స్తుందో చూడాలి.
Tags:    

Similar News