ఫేస్ బుక్ కు మరో షాక్... ఆ ఫీచర్ ను కాపీ కొట్టారంటున్న ‘ఫోటో’!

Update: 2021-11-07 23:30 GMT
ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజమైన  ఫేస్ బుక్ కు ఈ మధ్య వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వినియోగదారులకు సంబంధించిన సమాచారాన్ని బహిర్గతం చేసిందని ఆరోపణలు వెల్లువెత్తాయి . దీని నుంచి సంస్థ  ఊపిరి పోల్చుకోక ముందే మరో వివాదంలో చిక్కుకుంది.  ప్రముఖ  ఫోటో యాప్ అయిన ఫోటో అనే సంస్థ.. తమ ఫీచర్లలో ఒకటి  ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు కాపీ కొట్టాయని  ఆరోపించింది.  తమకు మాత్రమే చెందిన ఈ ఫీచర్ ను ఈ యాప్ లు క్లోన్ చేశాయని విమర్శించింది. దీనికి గానూ మాతృసంస్థ అయిన మెటా (ఫేస్ బుక్) నష్టపరిహారాన్ని చెల్లించాలంటూ కోర్టు మెట్లు ఎక్కింది.  దీంతో  ఆ సంస్థ అధినేత అయిన మార్క్ జూకర్ బర్గ్ కు నోటీసులు పంపించింది.పూర్తిస్థాయిలో  ఈ విషయంపై విచారణ జరిపి తమకు న్యాయం చేయాలంటూ  న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా వెలుగు చూసిన ఈ అంశం ఫేస్ బుక్ ను ఇబ్బంది పెట్టేలానే ఉందని టెక్ నిపుణులు చెప్తున్నారు.

ఇటీవల ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ పేరుతో తీసుకువచ్చిన వచ్చిన చిన్నచిన్న వీడియోలు  బాగా పాపులర్ అయ్యియి.  30 సెకన్లకు మించి ఉండని రీల్స్... సరదా కోసం ఇన్ స్టాగ్రామ్ చూసేవారిని బాగా ఆకట్టుకుంటున్నాయి. ఇన్ స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. దానిని ఉపయోగించే వారి చేయి సరాసరి రీల్స్ మీదేకే పోతుందంటే అతిశయోక్తి కాదు. ఇలా తక్కువ సమయంలోనే ఎక్కువ ప్రజాధారణ పొందింది  ఈ ఫీచర్. దీనిని వినియోగదారుకు మరింత కొత్తగా  అందించేందుకుగానూ  మాతృసంస్థ మెటా ఎప్పటికప్పుడు చాలా వినూత్నమైన  ఫీచర్లను వినయోగదారుల ముందుకు తీసుకుని వస్తోంది. ఈ క్రమంలో వచ్చినవే.. బూంబరింగ్, ఎమోజీ ఛాలెంజ్, హాట్ నెస్ వంటి ఫీచర్లు.

అయితే తాజాగా కొత్త  ఫీచర్ను సంస్థ తీసుకొచ్చింది. అది ఏమిటంటే.. ఒకే ఫ్రేమ్ లో వివిధ రకాల స్టిల్స్ తో ఐదు పిక్ లను తీసుకోవచ్చు. ఇలా చేసిన తరువాత అది ఆటోమేటిక్ గా ఓ చిన్న వీడియోగా మారుతుంది. దీని నిడివి సుమారు 20 నుంచి 30 సెకన్లకు మధ్యనే ఉంటుంది.  దీనిని పోస్ట్ చేయగానే ఇన్ స్టాగ్రామ్ లోని మన వాల్ లో కనిపిస్తుంది.  ఇది తక్కువ డేటాను  ఉపయోగించుకుని రూపొందడంతో ఎక్కువ మంది వినియోగదారులు దీనిని ఉపయోగించేదుకు ఇష్టపడుతున్నారు. ప్రస్తుతం ఫోటో అనే సంస్థ.. ఫేస్ బుక్ పై ఆరోపణలు గుప్పించింది ఈ ఫీచర్ పైనే.  వరుసగా ఒకే ఫ్రేమ్ లో ఐదు పిక్ లు వస్తుండం అనేది మాకు చెందిన ఫీచర్ అని... దానిని  ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ లు కాపీ కొట్టాయని పేర్కొంది. దీంతో తాము భారీగా నష్టపోయామని ఫోటో సంస్థ తెలిపింది.

ఫోటో యాప్ అనేది ప్రస్తుతం వాడుకలో లేదు. దీనిని 2014లో  ప్రారంభించారు.  కానీ దీనికి తగినంత ప్రాచూర్యం  రాకపోవడంతో సంస్థ  కేవలం మూడేళ్లలోనే దీనిని షట్ డౌన్ చేసింది.  ఇందులో ఉన్న కంటెంట్ ను  ఫేస్ బుక్ పరిశీలించి క్లోన్ చేసుకుందని ఫోటో సంస్థ ప్రతినిధులు చెప్తున్నారు. మరి ఈ ఆరోపణలపై ఫేస్ బుక్ ఏ విధంగా స్పందిస్తుంది అనేది  వేచి చూడాలి. ఫొటో ఫీచర్లను కాపీ కొట్టారన్న వార్తలు నిజమైతే ఫేస్ బుక్ కు మరో గట్టి షాక్ తగులుతుందని టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Tags:    

Similar News