విశాఖ స్టీల్ ప్రైవేటీకరణకి మరో ముందడగు .. అడుగుపెట్టనివ్వం అంటున్న కార్మికులు !

Update: 2021-07-08 12:30 GMT
విశాఖ ఉక్కు -ఆంధ్రుల హక్కు అంటూ సంపాదించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి కేంద్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తుంది. దీనికి సంబంధించిన కసరత్తును ఇప్పటికే ప్రారంభించిన కేంద్రం తాజాగా మరో కీలక అడుగు ముందడుగు వేసింది. ప్రైవేటీకరణ ప్రక్రియలో భాగంగా లీల్ అడ్వైజర్,ట్రాన్సాక్షన్స్  అడ్వైజర్ల కోసం ప్రభుత్వం బిడ్లు ఆహ్వానించింది. ఈ బిడ్లకు సంబంధించిన అప్లికేషన్లను బుధవారం నుంచి ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచింది. ఈనెల 15న ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేసన కేంద్రం  ఈనెల 28న దరఖాస్తుకు ఆఖరుతేదీగా నిర్ణయించింది. ఈనెల 29న టెక్నికల్ బిడ్స్ తెరుస్తామని ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ తాజా చర్యతో స్టీల్ ప్లాంట్ ప్లైవేటీకరణ అంశంలో కార్మికుల ఆందోళనలు, స్థానికుల డిమాండ్లను పట్టించుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

కాగా, ఈ ఏడాది జనవరి 27న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ను వందశాతం ప్రైవేటీకరించాలని నిర్ణయించారు. ఇప్పటి నుంచి కేంద్ర ప్రభుత్వానికి చెందిన డిపార్ట్‌ మెంట్‌ ఆఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ పబ్లిక్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌  ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ దిశగా చర్యలు ప్రారంభించింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తెలిసినప్పటి నుంచి విశాఖలో కార్మికులు, ప్రజల ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు.. కార్మిక సంఘాల ఆందోళనలకు మద్దతిచ్చాయి.

ప్రైవేటీకరణ వద్దు అంటూ ఓ వైపు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. మరోవైపు కేంద్రం మాత్రం  ప్రైవేటీకరణ ప్రక్రియను వేగవంత చేసి.. ఈ ఏడాది చివరికల్లా పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.  స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చెయ్యాలని టెండర్లు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయడంపై కార్మికులు నిప్పులు చెరుగుతున్నారు. ఈ తరుణంలో  విశాఖ స్టీల్ ప్లాంట్ నిరసనలు మళ్లీ పెద్దఎత్తున కొనసాగుతున్నాయి.

విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ప్రజా సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తారోకో చేశారు. కేంద్రం ఇచ్చిన నోటిఫికేషన్ వెంటనే వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ వేదికగా ఎంపీలు విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం పోరాడాలని పేర్కొన్నారు . ఈ నెల 10వ తేదీన విశాఖ స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా నిరసన ప్రదర్శనకు అఖిలపక్ష ,కార్మిక, ప్రజాసంఘాలు పిలుపునిచ్చాయి. వేల కోట్ల రూపాయలను పన్నుల రూపంలో చెల్లిస్తున్నస్టీల్ ప్లాంటును ప్రైవేటీకరించడానికి నిర్ణయం తీసుకోవడంపై కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకోసం చిత్తశుద్ధితో పనిచేయాలని కార్మిక సంఘాల నాయకులు విజ్ఞప్తి చేశారు. కేవలం లేఖలు రాసి, తీర్మానాలు చేస్తే సరిపోదని వారు మండిపడుతున్నారు. స్టీల్ ప్లాంట్ కొనుగోలు చేయడానికి ఎవరు వచ్చినా వారిని విశాఖ విమానాశ్రయంలో అడ్డుకుంటామని కార్మిక సంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు. ఎట్టిపరిస్థితిలోనూ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటు పరం చేస్తే ఊరుకోబోమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Tags:    

Similar News