వచ్చేనెలలో ఏపీ మంత్రివర్గం మార్పు

Update: 2020-03-11 09:30 GMT
అధికార వికేంద్రీకరణ పేరుతో మూడు రాజధానుల ఏర్పాటుపై జగన్ ప్రభుత్వం దూకుడుగా వెళ్తుంది. వికేంద్రీకరణ బిల్లు శాసనమండలిలో ఆమోదం లభించకపోవడంతో దాని పర్యవసానం మండలి రద్దు చేయాలనే నిర్ణయం వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం శాసనమండలి రద్దు అంశం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. అయితే మండలి రద్దవుతుందని బలంగా నమ్ముతున్న సీఎం జగన్ అందులో భాగంగా మంత్రులుగా ఉన్న ఎమ్మెల్సీలకు రాజ్యసభకు పంపిస్తూ నిర్ణయం తీసుకున్నారు. శాసనమండలి రద్దు అయితే వారి ఎమ్మెల్సీ సభ్యత్వం పోవడంతో మంత్రులుగా కొనసాగే అవకాశం ఉంది. దీంతో వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో రాజ్యసభకు పంపించారు.

ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రిగా పిల్లి సుభాశ్ చంద్రబోస్‌, మంత్రిగా మోపిదేవి వెంకటరమణ త్వరలోనే రాజీనామా చేసే అవకాశం ఉంది. వారు రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉంది. దీంతో ఆ రెండు స్థానాలు మంత్రి వర్గంలో ఖాళీ కానున్నాయి. అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలవుతోంది. అప్పుడు ఏర్పడిన మంత్రివర్గం ఇప్పటివరకు మరల పునరుద్ధరణకు నోచుకోలేదు. ఇప్పుడు ఆ స్థానాలు ఖాళీ అవడంతో మళ్లీ మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ ఉంటుందని ఆంధ్రప్రదేశ్ లో చర్చ సాగుతోంది. ఆ రెండు స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది. దీంతో పాటు మంత్రులుగా విఫలమైన మరో ఇద్దరి, ముగ్గురిని తొలగించి కొత్తవారికి అవకాశం ఇచ్చేలా పరిణామాలు కనిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల అనంతరం మంత్రివర్గ కూర్పు ఉండనుందని తెలుస్తోంది. ఎందుకంటే ఆ ఎన్నికల ఫలితాలను బట్టి ఎవరికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి? ఎవరిని ఉద్వాసన పలకాలనే దానిపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పుడు మంత్రివర్గం నుంచి వైదొలిగే వారిద్దరు బీసీలే. మళ్లీ ఆ స్థానాలను బీసీలతోనే భర్తీ చేస్తారని అధికార పార్టీ వర్గాలు చెబుతున్నారు. దీంతో బీసీ ఎమ్మెల్యేలు తీవ్ర ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ స్థానాలను తూర్పు గోదావరి జిల్లా, గుంటూరు జిల్లాలకు చెందిన బీసీ సామాజిక వర్గానికి చెందిన నేతలతో భర్తీ చేసే అవకాశాలు ఉన్నట్లు వస్తున్నాయి. తూర్పు గోదావరి జిల్లా నుంచి ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీశ్, గుంటూరు జిల్లా నుంచి చిలకలూరి పేట ఎమ్మెల్యే విడదల రజనీ కన్పిస్తున్నారు. ఎవరికి అవకాశం కల్పిస్తారో వేచి చూడాలి.
Tags:    

Similar News