అస‌ద్‌ కు టెన్ష‌న్ పెరిగిపోతోంద‌ట‌

Update: 2017-04-13 10:56 GMT
హైద‌రాబాద్ పాత‌బ‌స్తీని త‌మ ఇలాకాగా భావించే ఎంఐఎం రథ‌సారథి అస‌దుద్దీన్ ఓవైసీకి ఇప్పుడు అక్క‌డే ఎదురుగాలి వీస్తోందా? హైదరాబాద్‌లో మజ్లిస్ కోటకు బీటలు పడుతున్నాయా? అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ ద్వితీయ శ్రేణి నాయ‌క‌త్వం అన్న‌ద‌మ్ములైన అస‌ద్‌ -అక్బ‌రుద్దీన్‌ ల విష‌యంలో అసంతృప్తిగా ఉన్నార‌ని చెప్తున్నారు. ఇందుకు ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణం ఏమిటంటే...బీజేపీతో జ‌ట్టుక‌ట్టార‌నే అనుమానమేన‌ని అంటున్నారు.

బీజేపీతో ఎంఐఎం దోస్తీ క‌ట్టిన‌ట్లు మొదట్లో మీడియాలో వచ్చిన వార్తలను సోద‌రులు ఇద్ద‌రూ కొట్టేశారు. అయితే ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయంతో అది నిజమై ఉండవచ్చని ఎంఐఎం సానుభూతిప‌రులైన కొంద‌రు న‌మ్ముతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో నిత్యం రద్దీగా ఉండే దారుసలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయానికి ద్వితీయ శ్రేణి నాయకులు - కార్యకర్తల రాక క్రమంగా మందగించిందని అంటున్నారు. యూపీలో ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటినుంచి పార్టీ కార్యాలయంలో సందడి లేకుండా పోయిందని పలువురు చెప్తున్నారు. అసదుద్దీన్‌ ఓవైసీ, అక్బరుద్దీన్‌ ఓవైసీ ఇద్దరూ వచ్చినా నేతలు, కార్యకర్తలు పార్టీ కార్యాలయానికి రాలేదని తెలిసింది. దీంతో కార‌ణాలు ఆరాతీయ‌గా... బీజేపీతో దోస్తీ క‌ట్టిన‌ట్లు కొంద‌రు భావిస్తుండ‌ట‌మేన‌ని తేలింది. దీంతో ఓవైసీ బ్రదర్స్‌ దిద్దుబాటు చర్యకు దిగినట్టు తెలిసింది. యూపీ ఫలితాల అనంతరం ఏర్పడిన పరిస్థితులపై సీనియర్లతో చర్చించారు. ప్రజలు - నేతలు - కార్యకర్తల్లో తప్పుడు సంకేతాలు వెళ్లడాన్ని సీరియస్‌ గా తీసుకున్నారని వారు వివరించారని అంటున్నారు. దిద్దుబాటు చర్య చేపట్టకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ మనుగడ ప్రశ్నార్థ‌కంగా ఉంటుందని సోదరులిద్దరూ పార్టీకి చెందిన‌ ఎమ్మెల్యేలు, జీహెచ్‌ ఎంసీ కార్పొరేటర్లు, ఆయా జిల్లాల్లో గెలుపొందిన కౌన్సిలర్లు - సర్పంచులు - వార్డు మెంబర్లతో ఆఘమేఘాలమీద సమావేశాలు ఏర్పాటు చేశారని స‌మాచారం. ఎంఐఎం పార్టీని అణగదొక్కేందుకు కొన్ని శక్తులు కుట్రలు చేస్తున్నాయని, వారి మాటలు నమ్మే ప్రయత్నం చేయవద్దని కార్యకర్తలను నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలను వ్యతిరేకంగా చూస్తున్నామని, కలుపుకునే ప్రసక్తే లేదని బుజ్జగించినట్టు తెలిసింది.

గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌ లలో మైనార్టీలను ఊచకోత కోయించిన ప్రధాని నరేంద్రమోడీని ఓడించడం కోసం అన్ని రాష్ట్రాల్లో పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేస్తున్నామని నమ్మించేందుకు అసద్‌ - అక్బర్‌ లు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని స‌మాచారం. తాము బీజేపీకి ఎట్టిపరిస్థితుల్లో లొంగబోమని, ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని కోరుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇలా తమ ఓటు బ్యాంకు చెదిరిపోకుండా ప్రయత్నాలను ముమ్మరం చేశారు. దారుసలాంలోని పార్టీ కేంద్ర కార్యాలయం ఆవరణలో ఇటీవల అసదుద్దీన్‌ ఓవైసీ హడావుడిగా బహిరంగ సభ ఏర్పాటు చేశారు, ప్రధాని మోడీతోనూ, బీజేపీతోనూ ఎలాంటి లోపాయికారి ఒప్పందం జరగలేదని, కొన్ని దుష్టశక్తులు మజ్లిస్‌ పార్టీని అణగదొక్కేందుకు తప్పుడు ప్రచారాలు మొదలు పెట్టారంటూ సంజాయిషీ ఇవ్వ‌డం ఇందుకు నిద‌ర్శ‌నం అంటున్నారు. శాస్త్రీపురం - ఖిల్వత్‌ - మొగల్‌ పుర - బాబానగర్‌ తదితర ప్రాంతాల్లో బహిరంగ సభలు ఏర్పాటు చేస్తూ దిద్దుబాటుకు ప్రయత్నాలు చేస్తున్నారని చెప్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News