దేశం కోసం పరితపించిన యోధుడు..

Update: 2019-12-25 09:37 GMT
అటల్ బిహారీ వాజ్ పేయి.. దేశం కోసం కుటుంబాన్ని, పెళ్లిని త్యజించి సేవకే అంకితమైన మహా రాజకీయ వేత్త. దేశం కోసం పరితపించి నేటి బీజేపీ దేశాన్ని ఏకచ్చత్రాధిపత్యంగా ఏలుతుందంటే అది అటల్ పెట్టిన భిక్ష. ఆయన స్థాపించిన పార్టీయే నేడు ఇంతింతై వటుడింతై అన్నట్టుగా ఎదిగింది. భారత రాజకీయ పటంలో చెరగని ముద్రవేసిన అటల్ బిహారీ వాజ్ పేయి పుట్టిన రోజు అయిన నేడు (డిసెంబర్ 25)ను పురస్కరించుకొని ప్రత్యేక కథనం..

*అటల్ ది ఏ ఊరు?

మధ్య ప్రదేశ్ లోని గ్వాలియర్లో జన్మించిన అటల్ బిహారీ వాజ్‌పేయి అక్కడే సరస్వతి శిశు మందిర్ లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. 1939లో ఆర్ఎస్ఎస్ లో జాయిన్ అయ్యి అంచెలంచెలుగా ఎదిగారు. భారతీయ జనతా పార్టీ తరపున ప్రధాన మంత్రి పదవిని పొందిన నాయకుడు. ఈయన బ్రహ్మచారి. ఇతను మొదటిసారిగా రెండో లోక్‌సభకు ఎన్నికయ్యారు. మధ్యలో 3వ మరియు 9వ లోక్‌సభలకు తప్పించి 14వ లోక్‌ సభ ముగిసేవరకు పార్లమెంటుకు ప్రాతినిధ్యం వహించారు. ఆయన రెండుసార్లు రాజ్యసభకు కూడా ఎన్నికయ్యారు.

+అటల్ రాజకీయ ప్రస్థానం..

 *1968 నుండి 1973 వరకు జనసంఘ్ పార్టీకి అధ్యక్షుడిగా పనిచేశారు.

*1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని అద్వానీతో కలిసి వాజ్ పేయి ప్రారంభించారు. 1986 వరకు భారతీయ జనతా పార్టీకి వ్యవస్థాపక అధ్యక్షుడిగా పనిచేశారు.

*1996లో తొలిసారిగా ప్రధానమంత్రి పదవి యోగం లభించినా అది 13 రోజులకే పరిమితమైంది.

*1998లో రెండో పర్యాయం ప్రధానమంత్రి పదవి పొంది 13 మాసాలు పాలించారు. *1999లో 13వ లోక్‌సభ ఎన్నికల అనంతరం మరోసారి ప్రధానమంత్రి పదవి చేపట్టి 2004 వరకు పదవిలో ఉన్నారు. అలుపెరుగని ఈ రాజకీయ నాయకుడికి 1994లో ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు లభించింది.

*మొదటి కాంగ్రేసేతర ప్రభుత్వమైన మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో విదేశీ వ్యవహారాల శాఖను నిర్వహించారు. ఆయన అనారోగ్య కారణాల వల్ల క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారు.

* వాజ్ పేయి దేశానికి చేసిన విశేష సేవలకు గానూ భారత ప్రభుత్వం డిసెంబర్ 24, 2014లో భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు.

*వాజ్ పేయి పుట్టినరోజు అయిన డిసెంబర్ 25ను సుపరిపాలనా దినంగా భారత ప్రభుత్వం ప్రకటించింది.

*వాజ్‌పేయీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న' మార్చి 27 2015 న ప్రదానం చేశారు.

* అనారోగ్యంతో పూర్తిగా మంచంపై ఉన్న వాజ్‌పేయీకి భారత రత్న ప్రదానం చేయడానికి స్వయంగా రాష్ట్రపతే వాజ్‌పేయీ నివాసానికి తరలి రావడం విశేషం.

* బాల్‌రాజ్ మధోక్ మరియు లాల్ కృష్ణ అద్వానీ లతో కలిసి జనసంఘ్ ను జాతీయస్థాయి ప్రాముఖ్యతను సంతరించుకునే దిశగా నడిపించి నేటి మోడీషాలు దేశంలో బీజేపీని ప్రబలంగా నిలపడానికి మూలపురుషుడు వాజ్ పేయి కావడం గమనార్హం.
    

Tags:    

Similar News