భార‌తీయులకు మ‌రో చాన్స్.. శాశ్వ‌త వ‌ల‌స‌ల‌కు ఆ దేశం ఆహ్వానం!

Update: 2022-09-02 08:31 GMT
అభివృద్ది చెందిన దేశాల్లో ఒక‌టైన ఆస్ట్రేలియా శాశ్వ‌త వ‌ల‌స‌ల‌కు ఆహ్వానం ప‌ల‌క‌డానికి సిద్ధ‌మ‌వుతోంది. జూన్ 2023తో ముగిసే ఆర్థిక సంవ‌త్స‌రంలో శాశ్వ‌త వ‌ల‌స‌ల‌ను 35,000 నుంచి ఏకంగా 1,95,000కు పెంచ‌డానికి ఆ దేశం సిద్ధ‌మ‌వుతోంది.

ప్ర‌స్తుతం ఆస్ట్రేలియాలో న‌ర్సులు, ఇంజ‌నీర్ల‌కు బాగా కొర‌త ఉంది. గ‌త రెండేళ్లు కోవిడ్‌తో దేశ స‌రిహ‌ద్దుల‌ను మూసివేయ‌డం, చాలా దేశాల‌కు విమానా ప్ర‌యాణాలు ఆపేయ‌డం, విదేశీ విద్య కోసం వ‌చ్చిన విద్యార్థులు తిరిగి త‌మ దేశాల‌కు వెళ్లిపోవ‌డం వంటి కార‌ణాల‌తో ఆస్ట్రేలియాకు వ‌చ్చే వారి సంఖ్య బాగా త‌గ్గిపోయింది.

ఆస్ట్రేలియా జ‌నాభా 2.70 లక్ష‌లు మాత్ర‌మే కావ‌డం గ‌మ‌నార్హం. వైశాల్యంప‌రంగా ప్ర‌పంచంలోనే ఆరో పెద్ద దేశ‌మైన ఆస్ట్రేలియా ఈ నేప‌థ్యంలో శాశ్వ‌త వ‌ల‌స‌ల‌ను ఆక‌ర్షించాల‌నే ప‌నిలో ప‌డింది. ముఖ్యంగా సిబ్బంది కొరతతో సమస్యలు ఎదుర్కొంటున్న వ్యాపారాలకు ఈ నిర్ణయంతో ఊరట లభించే అవకాశం ఉంద‌ని చెబుతున్నారు. చదువుల కోసం విదేశాల‌కు వ‌చ్చిన విద్యార్థులు కోవిడ్ భ‌యాలతో తిరిగి వెళ్లిపోవ‌డంతో మాన‌వ వ‌న‌రుల కొర‌త ఆ దేశాన్ని ప‌ట్టి పీడిస్తోంది.

ఈ క్ర‌మంలో త‌మ వ‌ల‌స విధానాల‌ను మార్చుకునే అవ‌కాశం త‌మ‌కు కోవిడ్ క‌ల్పించింద‌ని ఆ దేశ ప్ర‌భుత్వం చెబుతోంది. ఈ అవ‌కాశాన్ని తాము వాడుకోవాల‌ని అనుకుంటున్నామ‌ని ఆస్ట్రేలియా అంటోంది. దీని ప్ర‌కారం వేల మంది న‌ర్సులు, ఇంజ‌నీర్లు అవ‌స‌రం ఆస్ట్రేలియాకు ఉంది.

ఈ నేప‌థ్యంలో వీసా ప్రాసెసింగ్‌ను కూడా వేగ‌వంతం చేస్తామ‌ని.. ఇందుకోసం మ‌రో 500 మంది సిబ్బందిని నియ‌మించుకుంటామ‌ని ఆస్ట్రేలియా హోం శాఖ మంత్రి క్లారె ఓనీల్ చెబుతున్నారు.
 
మ‌రోవైపు ఆస్ట్రేలియాలో గత 50 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం తగ్గిపోయింది. కేవ‌లం 3.4 శాతం మంది నిరుద్యోగులు మాత్ర‌మే ఉన్నారు. అయితే ద్ర‌వ్యోల్బ‌ణం మాత్రం పెరిగింద‌ని అంటున్నారు. ఈ నేపథ్యంలో వలస విధానాలను మార్చాలని వ్యాపార సంస్థలు ఆ దేశ ప్ర‌భుత్వాన్ని కోరుతున్నాయి. వార్షిక వలసలను 1,60,000కు పెంచాలని డిమాండ్ ఎప్ప‌టి నుంచో చేస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలో ఇందుకోసం ఆస్ట్రేలియా ప్రభుత్వం రాజ‌ధాని కాన్‌బెర్రాలో వ్యాపార, కార్మిక సంఘాలతో సమావేశమై పరిష్కార మార్గంపై వాటితో చ‌ర్చించింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందిన దేశాలు నైపుణ్యం గల ఉద్యోగుల కోసం వలస నిబంధనలు సవరిస్తున్నాయి. ఇప్పుడు అదే బాటలో ఆస్ట్రేలియా కూడా నడవనుంది.

ఈ నేప‌థ్యంలో భార‌తీయుల‌కు బంఫ‌ర్ చాన్సేన‌ని చెబుతున్నారు. మ‌న‌దేశంలో న‌ర్సులు, ఇంజ‌నీర్లు ఎక్కువ సంఖ్య‌లో ఉన్నారు. ఆస్ట్రేలియా స్థిర‌ప‌డాల‌నుకునేవారికి ఇది మంచి అవ‌కాశ‌మ‌ని అంటున్నారు. ప్ర‌పంచవ్యాప్తంగా ఉన్న మంచి అవ‌కాశాల‌ను కొల్ల‌గొట్ట‌డంలో ముందున్న భార‌తీయులు ఆస్ట్రేలియా అందిస్తున్న అవ‌కాశాన్ని విడిచిపెట్ట‌ర‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News