వైర‌స్‌ పై శుభ‌సూచికం: చిలుకూరులో ఆల‌యంలో తాబేలు ప్ర‌త్య‌క్షం

Update: 2020-07-19 08:37 GMT
వీసాల దేవుడిగా పేరుగాంచిన తెలంగాణ‌లోని హైద‌రాబాద్ శివారులో ఉన్న చిలుకూరు బాలాజీ ఆల‌యంలో ఆదివారం తెల్లవారుజామున ఓ వింత జరిగింది. ఆల‌య ఆవ‌ర‌ణ‌లో ఉన్న శివాల‌యంలో తాబేలు ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇది క‌నిపించ‌డంతో భ‌క్తుల‌తో పాటు అర్చ‌కులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. లోప‌లికి రావ‌డానికి ఎలాంటి మార్గం లేక‌పోయినా తాబేలు ఎక్క‌డి నుంచి వ‌చ్చిందో తెలియ‌డం లేదు. తాబేలు ప్ర‌త్య‌క్షంతో త్వ‌ర‌లోనే స‌మాజానికి మేలు చేస్తుంద‌ని భ‌క్తులు భావిస్తున్నారు. ఇది శుభసూచిక‌మ‌ని పేర్కొంటున్నారు.

చిలుకూరు బాలాజీ ఆలయ ఆవ‌ర‌ణ‌లో ఉన్న శివాలయంలో దాదాపు పది సెంటీ మీటర్ల పొడవు - ఆరు సెంటీమీటర్ల వెడల్పున్న తాబేలు ప్ర‌త్య‌క్ష‌మైంది. ఎలా ప్రవేశించిందో తెలియ‌దని శివాలయం పూజారి సురేశ్‌ ఆత్మారాం తెలిపారు. దీనిపై చిలుకూరు బాలాజీ ఆల‌య ప్రధాన పూజారి రంగ‌రాజన్ స్పందించి ఇది చాలా శుభసూచకమని - త్వ‌ర‌లోనే వైర‌స్ గురించి ప్రజలు శుభవార్త అందుకుంటారని తెలిపారు.

‘ఆలయంలోకి తాబేలు ప్రవేశించిన విషయాన్ని పూజారి సురేశ్ గుర్తించారు.. ఆలయంలోకి ప్రవేశించడానికి చిన్న మార్గం కూడా లేదు - ఇది ఓ అద్భుతం.. ఈ కూర్మమూర్తి ప్రవేశం ఒక దివ్యమైన సంకేతాన్ని సూచిస్తుంది - కూర్మావతారం ఉద్దేశం క్షీరసాగర మథనం. పూర్వం అమృతం కోసం క్షీరసాగర మథనం జరిగినప్పుడు కూర్మరూపంలో వచ్చిన మహావిష్ణువుపైనే మేరు పర్వతాన్ని కవ్వంగా ఉంచి వాసుకి సాయంతో ఒకవైపు దేవతలు, ఒకవైపు అసురులు మదించారు. ఇప్పుడు కూడా కోవిడ్-19పై విజయం కోసం విశ్వమంతా ప్రయత్నం చేస్తుంది. సాగర మథనంలో ఉద్భవించిన హాలాహలాన్ని పరమశివుడు మింగుతాడు. అలాగే ఇవాళ చిలుకూరులో సుందరేశ్వర స్వామి సన్నిధిలో కూర్మం ప్రత్యక్షమవడం అంటే త్వరలోనే లోకం నుంచి ఈ వైరస్ అంతమై అమృతం లభిస్తుందని సాక్షాత్తు ఆ వేంకటేశ్వర స్వామి సూచిస్తున్నట్లుగా ఉంది. భక్తులు చేసే ప్రార్థనలు - వైద్యులు - ఆరోగ్య సిబ్బంది సేవలు - ప్రభుత్వం ప్రయత్నాలు అన్నిటికీ తొందరలో మంచి ఫలితం లభిస్తుంది’అని రంగరాజన్ వివ‌రించారు.

Tags:    

Similar News