నిమిషానికి పుట్టేటోళ్లు..గిట్టేటోళ్ల తాజా లెక్క వచ్చేసింది

Update: 2019-09-05 06:01 GMT
ఇంత పెద్ద దేశంలో నిమిషానికి పుట్టేవాళ్లు ఎందరు?  మరణించే వారు ఎందరు? అన్న లెక్కలోకి వెళితే.. అందుకు వచ్చే సమాధానం ఆసక్తికరంగానే కాదు.. రానున్న రోజుల్లో చోటు చేసుకునే పరిణామాలు కళ్లకుకట్టినట్లుగా కనిపించక మానదు. దేశ జనాభా ఎంత అన్నంతనే 2010 జనాభా లెక్కల ప్రకారం అంటూ చెప్పుకొస్తారు. మరి.. ఇప్పటిమాటో అంటే సమాధానం కాస్త ఆలస్యంగా వస్తుంది.

అలాంటి తీరుకు భిన్నంగా ఇటీవల కాలంలో చోటు చేసుకున్న మార్పుతో దేశ జనాభా లెక్క దగ్గర దగ్గరగా తెలుసుకునే అవకాశం కల్పిస్తోంది పౌర నమోదు వ్యవస్థ. దేశంలో ఎవరు పుట్టినా.. మరణించినా 21 రోజుల వ్యవధిలో ప్రభుత్వ రికార్డుల్లో నమోదు చేయించటం తప్పనిసరి చేయటంతో ఇప్పుడు.. దేశ జనాభా ఎంతన్న అంశం మీద సమాధానం వెంటనే వచ్చేస్తోంది. ఇప్పుడు చెప్పే లెక్కలన్ని 2017 డిసెంబరు 31 నాటివి.

తాజాగా లెక్కల ప్రకారం ఏడాది వ్యవధిలో దేశ జనాభా 1.45 కోట్లు పెరిగినట్లుగా తేలింది. దేశంలో పుట్టినవారు.. మరణించిన వారి లెక్కల్ని చూస్తే ఈ విషయం బయటకు వచ్చింది. దేశ వ్యాప్తంగా నిమిషం వ్యవధిలో 49 మంది పుడుతుంటే.. అదే నిమిషంలో 15 మంది కన్నుమూస్తున్నారు. దేశ జనాభా 128.85 కోట్లుగా తేలింది.

దేశంలో అత్యధిక జనాభా ఉన్న రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ తొలి స్థానంలో నిలిచింది. ఆ రాష్ట్రంలో 22.26 కోట్ల జనాభాతో అగ్రస్థానంలో నిలిచింది. అదే సమయంలో అత్యల్ప జనాభా కలిగిన రాష్ట్రంగా సిక్కిం జాబితాలో చివరన ఉంది. ఈ రాష్ట్ర జనాభా కేవలం 6.56 లక్షల మంది మాత్రమే కావటం గమనార్హం. తొలి మూడు స్థానాల్లో అత్యదిక జనాభా ఉన్న రాష్ట్రాల్లో రెండో స్థానం మహారాష్ట్ర.. మూడో స్థానం బిహార్ గా నిలిచింది. నాలుగైదు స్థానాల్లో పశ్చిమబెంగాల్.. మధ్యప్రదేశ్ లు నిలిచాయి.

ఇక.. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే దేశ జనాభాలో పదో స్థానంలో ఆంధ్రప్రదేశ్ నిలిచింది. 5.23 కోట్ల మంది ఏపీలో ఉంటే.. తెలంగాణలో 3.69 కోట్ల మంది ఉన్నారు. దేశ జనాభాలో తెలంగాణది 12వ స్థానం. ఏపీలో జననాలు ఎక్కువగా ఉన్న జిల్లాల విషయానికి వస్తే తూర్పుగోదావరి.. కర్నూలు జిల్లాలు ఒకటి.. రెండు స్థానాల్లో ఉంటే.. మరణాల్లో మాత్రం గుంటూరు.. తూర్పుగోదావరి జిల్లాలు మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. అదే సమయంలో తెలంగాణలో జనన మరణాల్లో హైదరాబాద్ రెవెన్యూ జిల్లా తొలిస్థానంలో ఉంది.

కాకుంటే.. జననాల విషయంలో నిజామాబాద్ జిల్లా రెండో స్థానంలో ఉంటే.. మరణాల విషయంలో వరంగల్ అర్బన్ రెండో స్థానంలో ఉండటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో జననాల విషయంలో చిట్టచివరి స్థానంలో జనగామ జిల్లా నిలిస్తే.. మరణాల విషయంలో చివరి స్థానం మహబూబాబాద్ గా నిలిచింది.  మరో ఆసక్తికర అంశం ఏమంటే.. తెలంగాణలో మరణాలు 65-69 మధ్యన ఎక్కువ ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 54-65 ఏళ్ల మధ్యన ఎక్కువ ఉండటం విశేషం.
Tags:    

Similar News