బీజేపీని కడిగిపారేస్తున్నారుగా..!

Update: 2022-01-24 13:30 GMT
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నో తప్పులు చేస్తున్నా దాన్ని సరిగ్గా ఎండగట్టే ప్రతిపక్ష పాత్రను కాంగ్రెస్ చేయడం లేదన్న విమర్శ ఉంది. సోనియాకు వయసు అయిపోవడం.. రాహుల్ పగ్గాలు చేపట్టకపోవడం.. అంత పరిణతి కనిపించకపోవడం.. ఇక కాంగ్రెస్ సీనియర్లు తమ కడుపులో చల్ల కదలకుండా వ్యాపారాలు కాపాడుకుంటూ మౌనం దాల్చడంతో బీజేపీని అడిగే నాథుడే లేడన్న విమర్శ ఉంది.

అయితే ఏ వ్యాపారాలు లేని రాజకీయంలో ఉన్న కాంగ్రెస్ నేతలు మాత్రం కాస్త గట్టిగానే కేంద్రంలోని బీజేపీని కడిగేస్తున్నారు. తాజాగా ‘బీజేపీకి వేసిన ఒక్క ఓటు ఏమి చేసిందో చూడండి’ అంటూ ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేశారు మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. ఆయన కేంద్రంలోని మోడీ సర్కార్ కు వేసిన ప్రశ్నలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. ఎక్కడ చూసినా దీని మీదే హాట్ హాట్ చర్చ జరుగుతోంది.

కేంద్రంలోని మోడీ సర్కార్ పై తాజాగా కాంగ్రెస్ నేత, కరీంనగర్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శలు గుప్పించారు. బీజేపీకి వేసిన ఒక్క ఓటు ఏం చేసిందో చూడండి అంటూ 30 వైఫల్యాలను ట్వీట్ చేశారు. అవిప్పుడు బీజేపీకి బాగా గుచ్చుకున్నాయి. కక్కలేక మింగలేక వాటికి సమాధానం ఇవ్వలేక బీజేపీ నేతలు ఉక్కిరి బిక్కిరి అయ్యే పరిస్థితి నెలకొందని ప్రచారం సాగుతోంది.

‘బీజేపీకి వేసిన ఒక్క ఓటు దేశాన్ని పతనం వైపు నడిపిస్తుందని’ పొన్నం ప్రభాకర్ 30 ప్రశ్నలతో బీజేపీ వైఫల్యాలను కడిగిపారేశారు. దీనికి పరిష్కారం మరో స్వాతంత్ర్యం పోరాటమేనని పొన్నం ఇచ్చిన పిలుపు బీజేపీని షేక్ చేస్తోంది.

ప్రస్తుతం దేశంలో మోడీకి ఎదురులేకుండా పోయింది. సరైన ప్రత్యామ్మాయంగా నిలవాల్సిన కాంగ్రెస్ నాయకత్వ లోపంతో కునారిల్లుతోంది. దీంతో ప్రతిరాష్ట్రంలోనూ వెనుకబడిపోయి ప్రాంతీయ పార్టీలు గెలుస్తున్న పరిస్థితి నెలకొంది. పొన్నం ప్రభాకర్ సహా చాలా మంది మంచి నేతలున్నా సరిగ్గా వాడుకోవడం లేదు. మోడీ సర్కార్ వైఫల్యాలు బోలెడు ఉన్నా కూడా వాటిని కడిగేసి ప్రజల్లోకి తీసుకెళ్లగలిగే వారు లేరు. వచ్చే ఎన్నికల నాటికైనా మోడీ సర్కార్ వైఫల్యాలను జనంలోకి తీసుకెళితే కాంగ్రెస్ కు లాభం జరుగుతంది. అధికారం సాధ్యమవుతుంది.


Tags:    

Similar News