విస్తరణ ఎఫెక్ట్..మంత్రి బొజ్జల రాజీనామా

Update: 2017-04-02 05:23 GMT
ఏపీలో మంత్రి వర్గ పునర్ వ్యవస్థీకరణ అధికార టీడీపీలో అలకలకు, ఆగ్రహాలకు దారి తీసింది. కొత్తగా 11 మందికి మంత్రివర్గంలో చోటిచ్చే క్రమంలో ప్రస్తుతం ఉన్నవారిలో 5 గురిని తొలగిస్తున్నారు. ఆ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత జిల్లాకే చెందిన సీనియర్ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డిపై వేటు వేశారు. అయితే... తనను తొలగించడంపై బొజ్జల మండిపడుతున్నారు. అన్యాయంగా తొలగించారంటూ ఆయన బహిరంగంగానే గొంతు విప్పుతున్నారు. ఆ ఆవేశంలోనే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు.
    
మంత్రి పదవి నుంచి తొలగించినందుకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తీవ్ర మనస్థాపానికి గురయ్యారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌, సీఎం చంద్రబాబునాయుడుకు లేఖ రాసి పంపించారు. దీంతో చంద్రబాబు ఆయన్ను బుజ్జగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ.. ఒక పట్టాన వినే రకం కాని బొజ్జలను బుజ్జగించడం అంత సులభం కాదని టీడీపీ నేతలే అంటున్నారు.
    
అయితే.. బొజ్జలకు ఆరోగ్యం సహకరించడం లేదని.. ఆ కారణంగానే ఆయన్ను పదవి నుంచి తప్పించారని టీడీపీ వర్గాలు  చెబుతున్నాయి. కానీ.. బొజ్జల మాత్రం తనను అన్యాయంగా తొలగించారని అంటున్నారు. 
బొజ్జ‌ల అనారోగ్యం కారణంగా మంత్రి పదవి నుంచి తప్పించినట్లు వార్తలొచ్చాయి. దీనిపై స్పందించిన బొజ్జల మంత్రిగా పనిచేసేందుకు ఆరోగ్యం సహకరించడంలేదని చెప్పారు కదా... ఎమ్మెల్యే పదవిలో కొనసాగేందుకు కూడా తన ఆరోగ్యం సహకరించడం లేదని లేఖలో పేర్కొన్నారు .
అయితే... తన కుమారుడి రాజకీయ భవిష్యత్తు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్న బొజ్జల ఇప్పుడు రాజీనామాకు కట్టుబడి ఉంటారా.. వైసీపీలో చేరుతారా.. లేదంటే చంద్రబాబు బుజ్జగింపులతో మెత్తబడి మళ్లీ ఎప్పట్లా టీడీపీలోనే కొనసాగుతారా అన్నది చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News