చంద్రబాబు దూకుడు పెంచమంటే దానర్థం ఇదా..?

Update: 2015-03-18 07:34 GMT
ఏపీ అసెంబ్లీలో వ్యవహారం గాడి తప్పునట్లుగా ఉంది. సుదీర్ఘ ప్రస్థానమున్న రాజకీయ పార్టీ అధికార తెలుగుదేశం గత రెండుమూడురోజులుగా తన వ్యవహార శైలితో విమర్శలు ఎదుర్కొంటోంది. హుందాగల నేతగా దేశవ్యాప్తంగా పేరున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన మంత్రులు, ఎమ్మెల్యేల మితిమీరిన దూకుడు వల్ల అపఖ్యాతి పాలయ్యే ప్రమాదం కనిపిస్తోంది.

ప్రతిపక్షాల అసత్య ఆరోపణలను సమర్థంగా తిప్పికొట్టాలని.. సభలో మెతగ్గా ఉండొద్దని... అచ్చెన్నాయుడులా స్పీడుగా ఉండాలని చంద్రబాబు నాయుడు తన మంత్రులకు పలుమార్లు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, ఆయన మాటలను మంత్రులు, ఎమ్మెల్యేలు అర్థం చేసుకున్న తీరు వేరేగా ఉంది. దూకుడు పెంచమంటే దాడి చేసే స్థాయికి దిగజారుతున్నారు. టీడీపీ చరిత్రలో మునుపెన్నడూ లేనట్లుగా అనుచిత వ్యాఖ్యలు, గూండాగిరీ తరహా ప్రవర్తనతో బుధవారం అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబుకు చెడ్డపేరు తెచ్చేలా ప్రవర్తించారు.

నిజానికి సమావేశాల ప్రారంభంలో జగన్‌ వ్యాఖ్యల కారణంగా సభలో వైసీపీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. తమకు మాట్టాడే అవకాశం ఇవ్వకపోతే సభలో అగ్లీ సీన్స్‌ చూడాల్సి ఉంటుందని జగన్‌ అనడంతో ఆ పార్టీ, జగన్‌ను అందరూ తప్పుపట్టారు. దాంతో ఆ పార్టీ, జగన్‌ డిఫెన్సులో పడ్డారు కూడా. కానీ, తాజాగా బుధవారం టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యేలను ''ఏంట్రా.... ఏంట్రా.... పాతేస్తా నాయాలా...'' అంటూ అనడాన్ని టీడీపీ నాయకులే తప్పు పడుతున్నారు.  

అయితే, టీడీపీ సభ్యులు గతంలో ఎవరూ ఇంత దారుణంగా మాట్లాడిన ఉదంతాలు లేవు... దూకుడు గల నేతలు ఆ పార్టీలో ఉన్నప్పటికీ చంద్రబాబు హుందాతనానికి తగ్గట్లుగానే వారు కూడా నడుచుకునేవారు. కానీ, తాజా ఘటన మాత్రం చంద్రబాబుకు, టీడీపీకి అపఖ్యాతి తెచ్చేలా ఉంది. అయితే, దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి.
Tags:    

Similar News