య‌డ్డీ సెటైర్‌!... రాహుల్ ఓ కుర్రకుంక‌!

Update: 2018-02-21 11:07 GMT
వ‌చ్చే ఏడాది జ‌రగ‌నున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు సెమీ ఫైన‌ల్‌గా ప‌రిగ‌ణిస్తున్న కర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఎలాగైనా విజ‌యం సాధించి రెట్టించిన ఉత్సాహంతో ప్ర‌త్య‌ర్థిని చిత్తు చేయాల‌ని అటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్‌ తో పాటు ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు స‌మ‌ర స‌న్నాహాలు సిద్ధం చేసేసుకున్నాయి. క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబందించి ఇంకా షెడ్యూల్ కూడా విడుద‌ల కాక‌ముందే... ఇప్పుడు క‌న్న‌డ నాట ర‌స‌వ‌త్త‌ర రాజ‌కీయం న‌డుస్తోంద‌నే చెప్పాలి. బీజేపీ త‌ర‌ఫున ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా - పార్టీకి చెందిన కేంద్ర మంత్రులు ఇప్ప‌టికే క‌ర్ణాట‌క చుట్టూ చ‌క్క‌ర్లు కొడుతున్నారు. మ‌రోవైపు క‌న్న‌డ‌నాట ప్ర‌స్తుతం అధికార పార్టీగా కొన‌సాగుతున్న కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగానే తీసుకుంద‌న్న వాద‌న వినిపిస్తోంది. క‌న్న‌డ నాట వ‌రుస‌గా రెండో ప‌ర్యాయం అధికారం చేజిక్కించుకుని సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు రెట్టించిన ఉత్సాహంతో వెళ‌దామ‌ని హ‌స్తం పార్టీ ప‌క్కా ప్లాన్ వేసుకుంటోంది. ఇటీవ‌లి గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బీజేపీకి - గుజ‌రాత్‌ కే చెందిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి చుక్క‌లు చూపిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ... ఇప్పుడు క‌న్న‌డ నాట అంత‌కంటే స్పీడుతో ముందుకు సాగుతున్నారు.

మొన్న‌టిదాకా రాజ‌కీయాల్లో ప‌రిణ‌తి లేని నేత‌గా పేరు తెచ్చుకున్న రాహుల్ గాంధీ... గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌చారం నాటి నుంచి త‌న‌లోని అస‌లు సిస‌లు పొలిటీషియ‌న్‌ ను బ‌య‌ట‌కు తీసేశార‌నే చెప్పాలి. ఈ నేప‌థ్యంలో క‌ర్ణాట‌క ఎన్నిక‌లు ర‌స‌వ‌త్త‌రంగా జ‌ర‌గ‌డం ఖాయ‌మేన‌న్న వాద‌న వినిపిస్తోంది. ఈ క్ర‌మంలో బీజేపీ పాల‌న‌ - మోదీ తీరు - ఇటీవ‌ల వెలుగుచూస్తున్న ప‌లు అక్ర‌మాల‌పై రాహుల్ గాంధీ... నేరుగా మోదీని టార్గెట్ చేస్తూ త‌న‌దైన శైలి సెటైర్ల‌ను వ‌దులుతున్నారు. ఈ సెటైర్ల‌కు బీజేపీ నేత‌లు నిజంగానే చాలా ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. అయితే బీజేపీలోనూ సెటైరిక్ విమ‌ర్శ‌లు సంధించే నేత‌ల‌కు కొద‌వేమీ లేదు. అయితే వారంద‌రికీ స‌రైన టైమింగ్ దొర‌క‌డం లేదో, మరే కార‌ణ‌మో తెలియ‌దు గానీ... రాహుల్ పై విరుచుకుప‌డుతున్న బీజేపీ నేత‌లు ఇప్పుడు క‌నిపించ‌డ‌మే లేదు. మొత్తంగా బీజేపీ ఆత్మ ర‌క్ష‌ణ ధోర‌ణిలోనే ప‌డిపోయింది మిన‌హా.. ఎదురు దాడికి దిగిన దాఖ‌లాలు క‌నిపించ‌లేదు.

అయితే టైమింగ్ తో ప‌నేమీ లేకుండా... అలాంటి అవ‌కాశాల‌ను త‌న‌కు తానుగా సృష్టించుకోవ‌డంతో పాటుగా ప్ర‌త్య‌ర్థి ఎవ‌రైనా ఇట్టే విరుచుకుప‌డే బీజేపీ క‌ర్ణాట‌క శాఖ చీఫ్‌ - ఆ రాష్ట్ర మాజీ సీఎం బీఎస్ య‌డ్యూర‌ప్ప‌... ఇప్పుడు రాహుల్ గాంధీపై ఓ పెద్ద సెటైరే వేశారు. ఈ సెటైర్ నిజంగానే రాహుల్ గాంధీ అండ్ కోకు మంట పుట్టించ‌డం ఖాయ‌మనే వాద‌న కూడా వినిపిస్తోంది. అయినా య‌డ్డీ సాబ్‌.. రాహుల్‌ పై సంధించిన సెటైర్ ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... *రాహుల్ గాంధీ ఓ పిల్లోడు, కుర్ర‌కుంక‌* అంటూ య‌డ్డీ సంచ‌ల‌న వ్యాఖ్య చేశారు. బీజేపీ సోషల్ మీడియా కాంక్లేవ్ లో నేటి మ‌ధ్యాహ్నం య‌డ్డీ మాట్లాడుతూ - కర్ణాటకలో రాహుల్ ప్రచారం చేపట్టనుండటంపై విమర్శలు గుప్పించారు. తాము మరిన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని, 150కి పైగా సీట్లు గెలుచుకోవడం ఖాయమని య‌డ్యూర‌ప్ప‌ ధీమా వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్లకు పేదరిక నిర్మూలనకు పాటుపడాలనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి వచ్చిందంటూ ఆయ‌న‌ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తమ పార్టీ మాత్రం నిజాయతీగా పేదలకు చేయూత నిస్తోందని య‌డ్డీ సొంత డ‌బ్బా బాగానే కొట్టేసుకున్నారు. మ‌రీ రాహుల్ పై య‌డ్డీ సంధించిన సెటైర్ల‌పై కాంగ్రెస్ పార్టీ ఎలా రియాక్ట్ అవుతుందో చెప్పాలి.

Tags:    

Similar News