అనూహ్య పరిస్థితుల్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ దుర్మరణం దేశ ప్రజలను నిశ్చేష్టులను చేసింది. అయితే, ఈ దుర్ఘటనలో ఆయన భార్య మధుళిక మరణం దిగ్ర్భాంతికి గురిచేసింది. రావత్ సైన్యంలో లెఫ్టినెంట్ జనరల్ గా ఉన్న సమయంలో ఓసారి ఇలాంటి దుర్ఘటన నుంచి బయటపడ్డారు. 2015లో నాగాలాండ్ లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. 2015 ఫిబ్రవరి 3న నాగాలాండ్ రాష్ట్రంలోని దిమాపూర్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. నాడు ఆయన ప్రయాణించింది చీతా హెలికాప్టర్. ఆయనతో పాటు ఇద్దరు హెలికాప్టర్ లో ఉన్నారు. టేకాఫ్ అయిన సెకండ్లలోనే సాంకేతిక లోపం తలెత్తడంతో కొద్ది ఎత్తుకు వెళ్లగానే కుప్పకూలింది. హెలికాప్టర్ తీవ్రంగా దెబ్బతిన్నా.. నాడు రావత్, మిగతా ఇద్దరు క్షేమంగా బయటపడ్డారు. స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయి. నేడు అత్యంత అధునాతన ఎంఐ-17వీ5 హెలికాప్టర్ లో ప్రయాణిస్తూ రావత్ ఆయన సతీమణి ప్రాణాలు కోల్పోయారు. సూలూరు ఎయిర్ బేస్ నుంచి బయల్దేరిన కొద్ది సేపటికే కొద్ది దూరం వెళ్లగానే ఎంఐ-17వీ5 హెలికాప్టర్ క్రాష్ అయింది.