నిధులు ఇలాగైతే పోలవరం అయ్యేది ఎప్పటికి?

Update: 2017-10-07 17:30 GMT
కేంద్రం పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తాజాగా వెయ్యి కోట్ల రూపాయలు ఇవ్వడానికి కేంద్రం ఆదేశాలు ఇచ్చింది. దాదాపు 40 వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుకు కొత్తగా వెయ్యిరూపాయలు వచ్చేస్తున్నాయ్.. పనులు కాస్త జోరుగా సాగుతాయ్ అని మురిసిపోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే.. రాష్ట్రప్రభుత్వం పనుల మీద ఎన్నడో ఖర్చు పెట్టేసిన మొత్తం చెల్లింపుల్లో భాగంగానే ఈ వెయ్యి కోట్లు ఇచ్చారు తప్ప.. పనులు చురుగ్గా సాగడానికి అందుబాటులో ఉంచే మూలధనంలాగా మాత్రం ఇవ్వడం లేదు. ఇంత పెద్ద ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఇంత చిన్న చిన్న మొత్తాలను అప్పడప్పుడూ విడుదల చేస్తూ పోతే.. అసలు పోలవరం ప్రాజెక్టు ఎప్పటికి పూర్తవుతుందా? అనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయి.

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల మీద ఇప్పటికే తాము 3800 కోట్లరూపాయలు తమ ఖజానానుంచి ఖర్చు పెట్టేశాం అంటూ రాష్ట్రప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. ఈ నిధులు తక్షణం చెల్లించాల్సిందిగా చాలా కాలంగా రాష్ట్రం నుంచి విజ్ఞప్తులు వెళుతున్నాయి. కేంద్రంనుంచి చాలా సాదాసీదాగా స్పందన ఉంటోంది. గతంలో ఈ మొత్తంలో తొలివిడతగా ఓ వెయ్యికోట్ల రూపాయలు చెల్లించారు. కొన్ని నెలల తర్వాత.. ఇప్పుడు రెండో విడతగా మరో వెయ్యి కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇంకా పెట్టేసిన ఖర్చులోనే 1800 బాకీ ఉన్నాయి. అవి విడుదల అయ్యేలోగా మరో బడ్జెట్ సంవత్సరం వచ్చేస్తుందో ఏమో కూడా తెలియదు. నిధులు ఇంత నీరసంగా విడుదలవుతోంటే పనులు చురుగ్గా ఎలా జరుగుతాయి?

అది కూడా.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ కొన్ని రోజుల కిందట రాష్ట్రానికి వచ్చి.. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని పట్టిసీమ ప్రాజెక్టును కూడా సందర్శించి, పోలవరం పనులను కూడా పరిశీలించి వెళ్లారు.  ఆ సందర్భంలో.. పోలవరం ప్రాజెక్టు మీది కాదు  నాది.. దీన్ని సొంత ప్రాజెక్టుగా భావించి సత్వరం పూర్తి చేయడానికి ప్రయత్నిస్తా అని ఆయన చెప్పారు. అంత లావు హామీలు ఇస్తేనే వచ్చింది కేవలం  పాత బాకీలో నాలుగో వంతు! మరి పనులు వేగిరం పూర్తి కావడానికి  ఆయన ఉదారంగా నిధులు ఇవ్వడానికి ఇంకా ఎన్ని నెలలు గడచిపోతాయో వేచిచూడాలి.
Tags:    

Similar News