రైతుల పోరాటం ఫలించింది. అన్నదాతల ఆందోళనకు ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది. గడిచిన కొన్ని రోజులుగా దేశరాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద తమిళ రైతులు వినూత్న రీతిలో నిరసనలు తెలుపుతూ ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. రైతుల ఆందోళనకు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు విపక్ష నేత స్టాలిన్ సహా తమిళ సినీ నటులు - పలువురు రాజకీయ నేతలు సంఘీభావం తెలిపి రైతుల ఆందోళనలో పాల్గొన్నారు. దీంతో కేంద్రం ఇరకాటంలో పడింది. తమిళనాడు ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం రూ. 2014.45 కోట్లు సహాయంగా అందజేసింది. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీ 23 మార్చి - 2017న సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈవాళ సహాయాన్ని ప్రకటించింది.
తమిళనాడుకు ప్రకటించిన మొత్తం రూ. 2014.45 కోట్లలో రూ. 1748 కోట్లు కరువు సాయం కాగా, రూ. 264.11 కోట్లు వార్ధా తుపాను సాయం - రూ. 2.06 కోట్లు జాతీయ తాగునీటి పథకం కింద సహాయంగా కేంద్రం అందజేసింది. కరువు, వరద నష్టంపై తమిళనాడు ప్రభుత్వం ఇదివరకే కేంద్రానికి నివేదికను పంపింది. క్షేత్రస్థాయిలో అధ్యయనానికి కేంద్రం ఓ కమిటీని తమిళనాడుకు పంపింది. కమిటీ నివేదికను అనుసరించి కేంద్రం ఈ సహాయాన్ని ప్రకటించింది. అదేవిధంగా కర్నాటకకు సైతం కేంద్రం కరువు సాయాన్ని ప్రకటించింది. జాతీయ విపత్తు నిధి కింద రూ. 1,235.52 కోట్లు కరువు సాయంగా ఇచ్చింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/