అమ్మ పెట్టాపెట్ట‌దంటే ఇదేనా చంద్ర‌బాబు?

Update: 2017-06-04 16:27 GMT
ఏమైనా మ‌న పెద్దోళ్ల‌కు ఉన్న దూర‌దృష్టి మ‌రెవ‌రికీ లేద‌నే చెప్పాలి. ఎంతో చెప్పాల్సిన భావాన్నిసామెత‌ల రూపంలో సింఫుల్ గా చెప్పేయ‌టం.. అప్పుడెప్పుడో వాడినవ‌న్నీ.. ఈ కాలానికి స‌రిపోయేలా ఉండ‌టం చూస్తే.. వారికి స‌లాం కొట్టాల్సిందే. తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ను చూసినంత‌నే.. అప్ర‌య‌త్నంగా మ‌న‌సులో పాత సామెత కొత్త‌గా గుర్తుకు రావ‌టం ఖాయం.

అమ్మ పెట్టా పెట్ట‌దు.. అడ‌క్క తినానీయ‌ద‌న్న‌ది ఆ సామెత మాదిరిగా త‌యారైంది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడి తీరు చూస్తుంటే.  తాజాగా కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఏపీ ప‌ర్య‌ట‌న‌పై గ‌తంలో ఎప్పుడూ లేని విధంగా నిప్పులు చెరుగుతున్నారు చంద్ర‌బాబు. రాహుల్ ప‌ర్య‌ట‌న‌కు ఏపీ ప్ర‌జ‌లు వెళ్ల‌కూడ‌ద‌న్న మాట‌ను ఆయ‌న చెబుతున్నారు. ఏపీ విభ‌జ‌న పాపం కాంగ్రెస్ అంటూ అభివ‌ర్ణిస్తున్న ఆయ‌న‌.. ఆ పార్టీని క్ష‌మించ‌కూడ‌ద‌ని.. భూస్థాపితం చేయాలంటున్నారు. నిజ‌మే.. బాబు చెప్పిన మాట‌ల్లో నిజం ఉంది. కానీ.. అదే అస‌లు నిజ‌మా? అన్న‌ది అస‌లు ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఇప్పుడు ఏపీకి ఏం కావాల‌న్న‌ది ఆంధ్రోళ్లు నిర్ణ‌యించుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది.

విభ‌జ‌న పాపానికి కాంగ్రెస్ కార‌ణ‌మైనా.. అలా చేయ‌టానికి ఇదే టీడీపీ అధినేత చంద్ర‌బాబు త‌న స్వ‌ద‌స్తూరితో సంత‌కం చేసిన విభ‌జ‌న‌కు మ‌ద్ద‌తు లేఖ కూడా కార‌ణ‌మ‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. విభ‌జ‌న కార‌ణంగా ఏపీ న‌ష్ట‌పోయింద‌న్న‌ది నిజం. దాన్నెవ‌రూ కాద‌న‌లేదు. కానీ.. జ‌రిగిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేసేందుకు విభ‌జ‌న చ‌ట్టంలో కొన్ని హామీలు చట్టాలుగా.. మ‌రికొన్ని నోటిమాట‌గా ఇచ్చిన హామీలు ఉన్నాయి. చ‌ట్టంలో ఉన్న హామీలు అమ‌లుకు సాంకేతిక కార‌ణాలు చూపిస్తూ కొన్ని అమ‌లు చేయ‌కుండా ఆపేయ‌గా.. నోటిమాట‌గా ఇచ్చిన హోదా లాంటి హామీలకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త లేవ‌ని తేల్చేచారు. మొత్తంగా.. చూస్తే ఏపీకి ఏమీ ఇవ్వ‌కుండా మొండిచేయి చూపించార‌న్న‌ది నిజం.

హోదాతో ఏపీకి పున‌రుత్తేజం క‌లిగేలా చేయ‌టం.. అభివృద్ధి దిశ‌గా ప‌రుగులు తీసే అవ‌కాశాన్ని మోడీ స‌ర్కారు చేజేతులారా అడ్డుకుంద‌న్న‌ది కాద‌న‌లేని వాస్త‌వం. ఏపీకి హోదా ఇస్తే.. మిగిలిన రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున డిమాండ్లు వ‌స్తాయ‌న్న‌ది ఎంత‌మాత్రం నిజంకాద‌నే చెప్పాలి. ఎందుకంటే.. ఏపీకి ఎదురైన ప్ర‌త్యేక ప‌రిస్థితి దేశంలోని అన్నిరాష్ట్రాల‌కు తెలిసిందే. అలాంటి వేళ‌.. వేరే రాష్ట్రాల పేరు చెప్పి ఏపీకి ఇవ్వాల్సిన హోదా ఆపుతున్నారంటేనే.. ఏపీ ప్ర‌యోజ‌నాల్ని దెబ్బ తీసే భారీ కుట్ర‌కు తెర తీశార‌న‌టంలో సందేహం లేదు.

ఇక‌.. తాజాగా నెల‌కొన్న ప‌రిస్థితుల్ని చూద్దాం. ఏపీకి ప్రాణాధారం అనుకున్న ప్ర‌త్యేక  హోదా హామీని మ‌డ‌త‌పెట్టి.. భూస్థాపితం చేశార‌న‌టంలో సందేహం లేదు. ఇలా మ‌డ‌తేయ‌టంలో మోడీ సర్కారు మొద‌లు పెడితే.. వారి వ్యూహ అమ‌లుకు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఓకే అనేశారు. దీంతో.. బీజేపీ.. టీడీపీ కోణాల్లో చూస్తే ఏపీకి హోదా అన్న‌ది ముగిసిన అధ్యాయంగా మారింది. ఇలాంటి వేళ‌లో.. కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఏపీకి వ‌స్తూ.. తాము ఇచ్చిన హోదా హామీని నిల‌దీయ‌నున్న వేళ‌లో బాబు స్పంద‌నను ఇప్పుడు నోట్ చేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఎందుకంటే.. ఇప్పుడు రాహుల్ ఏపీకి వ‌స్తున్న‌ది రాష్ట్రానికి మేలు చేసే అంశానికి. అలాంట‌ప్పుడు ఆయ‌న‌కు మ‌ద్ధ‌తు ఇవ్వాల్సింది పోయి.. అందుకుభిన్నంగా ఆయ‌న స‌భ‌ల‌కు ఏపీ ప్ర‌జ‌లు ఎవ‌రూ వెళ్లొద్దంటూ ముఖ్య‌మంత్రి స్థానంలో ఉన్న వ్య‌క్తి చెప్ప‌టాన్ని ఏమ‌నాలి? ఎలా చూడాలి? బాబు చెప్పిన‌ట్లు ఏపీ విభ‌జ‌న పాపం కాంగ్రెస్‌దే. కానీ.. ఇపుడు పాయింట్ ఏంటన్న‌ది ఇంపార్టెంటు.

విభ‌జ‌న జ‌రిగి మూడేళ్లు అయిపోయిన త‌ర్వాత కూడా.. విభ‌జ‌న కార‌ణంగా జ‌రిగే న‌ష్టాల గురించి.. నాడు జ‌రిగిన అన్యాయం గురించి మాట్లాడ‌టానికి మించిన శుద్ధ‌వేస్ట్ వ్య‌వ‌హారం మ‌రొక‌టి ఉండ‌దు. జ‌రిగింది జ‌రిగిపోయింది. ఎలా జ‌రిగింద‌న్న‌ది వ‌దిలేసి.. జ‌రిగిన న‌ష్టానికి లాభం చేకూర‌టానికి ఏం చేస్తే బాగుంటుంద‌న్న అంశం మీద దృష్టి పెడితే బాగుంటుంది.

ఇప్పుడు ఆంధ్రోళ్లంతా ఆలోచించాల్సింది.. ఏపీకి లాభం చేసే వారు ఎవ‌రు? అని మాత్ర‌మే. హోదా కార‌ణంగా ఏపీ భ‌విష్య‌త్ మొత్తంగా మారిపోతుంద‌న‌టంలో సందేహం లేదు. కానీ.. మారిన చ‌ట్టాల ప్ర‌కారం హోదా అమ‌లు సాధ్యం కాదు. కానీ.. ప్ర‌జల పోరాటం, రాజ‌కీయ ఒత్తిడి కార‌ణంగా అది సాధ్య‌మ‌వువ‌తుంద‌న్న‌ది ఖాయం. అది చంద్ర‌బాబు ఎలాగూ తేలేడు. జ‌గ‌న్ ప్ర‌జ‌ల పోరాటానికి మ‌ద్ద‌తు ఇచ్చి ఇప్ప‌టికే చాలా సార్లు దాని గురించి గ‌ళ‌మెత్తారు. పోరాడారు. కేంద్ర పెద్ద‌ల‌ని క‌లిశారు. జ‌గ‌న్ పోరాటానికి ప‌వ‌న్ కేవ‌లం ట్విట్ట‌ర్ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాడు. తాజాగా  రాహుల్ గాంధీ మ‌ద్ద‌తు ప‌లికి ఏకంగా ఏపీలో ఒక స‌భ పెట్టారు. అలాంట‌ప్పుడు దాన్ని వ్య‌తిరేకిస్తే మోడీకి లాభం... ఏపీకి న‌ష్టం. ఇక్క‌డ ప్ర‌స్తావించాల్సిన అంశం ఇంకొక‌టి కూడా ఉంది.

చ‌రిత్ర‌ను చూస్తే.. మ‌రో విష‌యం కూడా క‌నిపిస్తుంది. విభ‌జ‌న మీద కానీ హోదా మీద కానీ గ‌తంలో బీజేపీ తానిచ్చిన ఏ హామీని నెరవేర్చింది లేద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు. చిన్న‌రాష్ట్రాల‌కు తాము అనుకూలం అంటూనే.. తెలంగాణ విష‌యంలో సాచివేత ధోర‌ణిని ప్ర‌ద‌ర్శించింది. విభ‌జ‌న వ‌ల్ల జ‌రిగిన న‌ష్టాన్ని భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పిన మోడీ.. ఓట్లు వేయించుకున్నాక తూచ్ అన్నారే కానీ.. తానిచ్చిన మాట‌ను నెర‌వేర్చాల‌న్నది ఆయ‌న‌లో క‌నిపించ‌దు. ఇలాంట‌ప్పుడు ఏపీకి జ‌రిగిన న‌ష్టాన్ని హోదాతో భ‌ర్తీ చేస్తామ‌ని చెబుతున్న రాహుల్ అండ్‌ కో మాట‌ను ఏపీ ప్ర‌జ‌లు న‌మ్మితే పోయేదేమిటి? అంత‌కుమించి ఇపుడు ఏం చేసేది కూడా లేదు. ఇప్ప‌టికే హోదా విష‌యంలో న‌మ్మించి మోస‌పుచ్చిన మోడీ తీరును చూసిన ఆంధ్రోళ్లు.. రాహుల్ ను న‌మ్మితే జ‌రిగే న‌ష్టం పెద్ద‌గా ఉండ‌ద‌ని చెప్పాలి. మ‌రి.. ఇలాంటి వేళ‌.. తాను తీసుకురాలేని హోదాను ఇంకొక‌రు ఇచ్చేందుకు అండ‌గా నిలుస్తామ‌ని చెబుతున్న‌ప్ప‌డు వారికి ఓపెన్ స‌పోర్ట్ ఇవ్వ‌లేకున్నా.. బాబు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు. ఏపీ హోదా కార‌ణంగా జ‌రిగే ప్ర‌యోజ‌నం కంటే కూడా.. బాబుకు త‌న రాజ‌కీయ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మా? అన్న సందేహం రాహుల్ ప‌ర్య‌ట‌న మీద మాట్లాడిన వ్యాఖ్య‌ల్ని చూసిన‌ప్పుడు క‌నిపించ‌క మాన‌వు. ఈ మొత్తం ఎపిసోడ్‌ను చూసిన‌ప్పుడు అనిపించేది ఒక్క‌టే.. హోదా తేక‌పోతే తేలేకపోయావ్‌.. తెస్తామంటున్న వాళ్ల‌ను తెచ్చేలా పోరాడేందుకు ఎంతో కొంత మ‌ద్ద‌తు ఇవ్వొచ్చుగా   !

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News