అలాంటప్పుడు గొప్పలు చెప్పటంఎందుకు బాబు?

Update: 2016-02-09 07:08 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నోటి వెంట చిత్రమైన వ్యాఖ్య ఒకటి వచ్చింది. గ్రేటర్ ఎన్నికల ఫలితాలపై ఆయన ఎలా రియాక్ట్ అవుతారో అని చాలామంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటూ.. పక్క రాష్ట్రంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం కోసం రెండు రోజులు కేటాయించిన చంద్రబాబు.. తన ప్రచారంలో భాగంగా హైదరాబాద్ కు తానేం చేశానన్న విషయాలు చాలానే చెప్పుకున్నారు.

హైదరాబాద్ ను అంతర్జాతీయంగా ఫేమస్ చేశానని.. నిజాం.. బ్రిటీషోళ్లకంటే తానే ఎక్కువగా అభివృద్ధి చేశానని.. ఇలా చాలానే గొప్పలు చెప్పినప్పటికీ గ్రేటర్ ప్రజలు మాత్రం ఆయన పార్టీని ఒక్క డివిజన్ లోనే గెలిపించటం తెలిసిందే. 150 డివిజన్లకు జరిగిన ఎన్నికల్లో కేవలం ఒక్క స్థానంలోనే విజయం సాధించటంపై ఒక విలేకరి ప్రశ్నించగా.. మేనేజ్ మెంట్ గురు స్టైల్లో ఆయన సమాధానం ఇవ్వటం గమనార్హం.

తాను చేసిన అభివృద్ధి ఫలితం ఆశించి చేసింది కాదని.. ఫలితం ఆశిస్తేనే బాధ కలుగుతుందని.. కానీ తాను బాధ పడటం లేదని.. ఎందుకంటే.. తాను తన బాధ్యత నిర్వర్తించానే కానీ.. ప్రజలు ఓట్లు వేస్తారా? వేయరా? లాంటి విషయాల గురించి ఆలోచించి తాను అభివృద్ధి చేయలేదని చెప్పుకొచ్చారు. బాబు చెప్పింది నిజమేనని ఒప్పుకుంటే.. మరింత విశాల హృదయం ఉన్న బాబు.. చేసిన అభివృద్ధి గురించి దాదాపు పన్నెండేళ్ల తర్వాత కూడా గొప్పలు చెప్పుకోవటం ఎందుకో? చేసింది మంచి పని అయితే.. ప్రజలు గుర్తిస్తారు కదా అని చేసిన పనుల గురించి అదే పనిగా చెప్పుకోకుండా ఉండొచ్చుగా? మరి అలాంటి పని బాబు ఎందుకు చేయరు..?
Tags:    

Similar News