అధికారులను వణికించిన బాబు సాహసం

Update: 2015-12-09 04:46 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విపరీతంగా కష్టపడుతుంటారు. ఇందుకోసం రెక్కలు ముక్కలు చేసుకుంటారు. అటు శారీరక శ్రమకు సైతం పెద్దగా వెనుకాడరు. విప్తతు సమాయాల్లో.. ఊహించని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ఆయన కష్టపడే తీరు చూస్తే.. ముచ్చటేస్తుంది. పదేళ్ల పాటు ఊరించి.. ఊరించి.. చివరకు చేతికి చిక్కిన అధికారాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకొని.. తిరుగులేని రాజకీయ శక్తిగా మారాలని ప్రయత్నిస్తున్న చంద్రబాబు.. ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సాహసాలు చేసేస్తున్నారు.

ఉత్సాహంతో ఉరకలెత్తుతున్న ఆయన.. ప్రమాదకరమైన ప్రాంతాలకు దూసుకెళుతున్నారు. తనకు ఏమైనా ఇబ్బందా? అన్న విషయాన్ని పట్టించుకోవటం లేదు. ఈ వయసులోనూ కుర్రాడిలా చురుకుగా కదలడం మంచిదే గానీ ఆయన ప్రమాదకరమైన ప్రాంతాల్లో ఆయనకు ఏమైనా అవుతుందోనన్న భయంతో అధికారులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ప్రాజెక్టులను పరిశీలించిన ఆయన.. పోలవరం ప్రాజెక్టు వద్ద ఇనుప కమ్మీలతోకట్టిన మెట్లను అలవోకగా ఎక్కేశారు. నిజానికి ఇలాంటి కడ్డీల మీద ఎక్కటం అంత తేలికైన విషయం కాదు.. ఇంజినీరింగ్ నిపుణులు.. మేస్త్రీలు.. కూలీలు మాత్రమే ఎక్కే అవకాశం ఉంది. కానీ.. అలాంటివేమీ పట్టించుకోకుండానే మెట్లు ఎక్కేసిన బాబు.. పనులను సమీక్షించారు. ఇనుప కమ్మీలను ఎక్కి.. మళ్లీ జాగ్రత్తగా దిగే వరకూ అధికారులు విపరీతంగా టెన్షన్ పడిపోయారు. ఆయన మెట్లు ఎక్కే టప్పుడు.. ఇనుప కమ్మీలు కదలకుండా జాగ్రత్తగా పట్టుకున్నారు. మొత్తానికి బాబు ఉత్సాహం.. అధికారుల్ని అప్పుడప్పడు భయపెట్టేస్తుందని చెప్పక తప్పదు.
Tags:    

Similar News