చైనా తెగింపు:క‌శ్మీర్ లేకుండానే భార‌త్

Update: 2018-01-04 16:47 GMT
ప‌క్క‌నే  ఉన్న‌ప్ప‌టికీ ప‌క్క‌లో బ‌ల్లెంలా మారిన చైనా భార‌త్‌ ను ఇర‌కాటంలో ప‌డేసేందుకు అన్ని ర‌కాల మార్గాల‌ను అన్వేషిస్తోంది. ఇప్ప‌టికే స‌రిహ‌ద్దు వివాదంతో ప్ర‌త్య‌క్షంగా...పాకిస్థాన్‌ కు మ‌ద్ద‌తివ్వ‌డం ద్వారా పరోక్షంగా చైనా త‌న వ‌క్ర‌బుద్ధిని చాటుకుంటున్న సంగ‌తి తెలిసిందే. దీనికి కొన‌సాగింపుగా మ‌రో బ‌లుపు చ‌ర్య చేప‌ట్టింది. క‌శ్మీర్ లేకుండానే భార‌త్ ఉన్న గ్లోబుల‌ను ముద్రించింది. పెద్ద ఎత్తున కెన‌డాలో ఈ గ్లోబుల‌ను దింపుతోంది. ఓ భార‌తీయుడు ఈ ప‌రిణామంపై ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డంతో వెలుగులోకి వ‌చ్చింది.

కెన‌డాలో నివ‌సిస్తున్న సందీప్‌ దేశ్వాల్‌ అనే ఓ భారత సంతతి అమెరికన్‌. ఈ క్రిస్మ‌స్ సంద‌ర్భంగా ఆయ‌న ఆరేళ్ల‌ కుమార్తె అస్మిత శాంటా తాతకు తనకు గ్లోబ్‌ కావాలని కోరింది. దీంతో ఆ పాప కోసం త‌ల్లిదండ్రులు గ్లోబ్ తీసుకువ‌చ్చారు. అయితే ఆ చిన్నారి ఆస‌క్తిక‌ర సందేహం అడిగింది. `డాడీ...ఇందులో కెన‌డా ఎక్క‌డ‌?  భార‌త‌దేశం ఎక్క‌డ?` అంటూ ఆమె ప్ర‌శ్నించింది. దీంతో అవాక్క‌వ‌డం వారి వంత‌యింది. ఎందుకంటే...ఆ గ్లోబ్‌ లో భార‌త్ స్వ‌రూపం మారిపోయింది. క‌శ్మీర్ లేకుండానే భార‌త్‌ ను ముద్రించిన చైనా గ్లోబ్ అది. ఈ విష‌యాన్ని త‌మ‌కు అమ్మిన దుకాణం వ‌ద్ద‌కు వెళ్లి చెప్పేందుకు ప్ర‌య‌త్నించ‌గా...అక్క‌డ ద‌ర్శ‌న‌మిచ్చిన గ్లోబులు అన్నీ అవే రూపంలో ఉన్నాయి. దీంతో అవాక్క‌వ‌డం సందీప్ వంతు అయింది.

నూతన సంవత్సరం సందర్భంగా తాను షాక్‌ కు గురైన అంశం గురించి సందీప్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. `ఈ గ్లోబ్‌ను నా చిన్నారికి చూపిస్తే...అస‌లైన భార‌త్ కంటే...మరో రూపంలో ఉన్న భారత్‌ చిత్రపటాన్ని నా కూతురు ఊహించుకుంటుంది. కశ్మీర్‌ కూడా భారత్‌ లో భాగమే అనే విషయాన్ని ఇప్పుడు నేను నా కూతురుకి చెప్పకుంటే ఆమె అవ‌గాహ‌న పూర్తిగా మారిపోతుంది. భ‌విష్య‌త్తులో కూడా ఇలాంటిదే జ‌రుగుతుంది. చైనా దురుద్దేశ‌పూర్వ‌కంగా చేసిన ఈ చ‌ర్య‌ను ఏ మాత్రం స‌హించ‌వ‌ద్దు` అని వ్యాఖ్యానించారు. ఇలాంటి  వాటిపై త‌గు రీతిలో స్పందించాల‌ని సందీప్ ఆకాక్షించారు.


Tags:    

Similar News