భారత్ కు ‘సిటీ బ్యాంక్’ గుడ్ బై!

Update: 2021-04-16 07:30 GMT
అమెరికాకు చెందిన బ్యాంకింగ్ దిగ్గజం సిటీ బ్యాంక్ సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. భారత దేశంలో కన్స్యూమర్ బ్యాంకింగ్ వ్యాపారం నుంచి తప్పుకుంటున్నట్లుగా స్పష్టం చేసింది. దేశంలో ఈ బ్యాంక్ కు 35 శాఖలు ఉన్నాయి. సిటీ బ్యాంక్ కన్స్యూమర్ బ్యాంకింగ్ విభాగంలో దాదాపు 4 వేల మంది పని చేస్తున్నారు.  

క్రెడిట్ కార్డులు.. రిటైల్ బ్యాంకింగ్.. హోం లోన్లు.. వెల్త్ మేనేజ్ మెంట్ లు ఈ వ్యాపార పరిధి లోకి వస్తాయి. ఒక్క భారత్ లోనే కాదు.. మరో పన్నెండు దేశాల్లోనూ కన్స్యూమర్ సేవల నుంచి తప్పుకుంటున్నట్లు ఆ బ్యాంకు గ్లోబల్ సీఈవో జేన్ ఫ్రేజర్ వెల్లడించారు. తమ బ్యాంక్ మార్కెట్ లోని ఇతర సంస్థలతో పోటీ పడలేకపోవటంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు.

అయితే.. సిటీ బ్యాంక్ తాను అందిస్తున్న సేవల నుంచి ఎలా వైదొలుగుతుందన్న విషయంపై స్పష్టత రావటం లేదు. దీనికి కారణం లేకపోలేదు. ఎందుకంటే.. భారత్ లో తాను చేస్తున్న వ్యాపారం నుంచి వైదొలిగేందుకు ఆర్ బీఐ అనుమతి అవసరం. అయితే.. సిటీ బ్యాంక్ ఇండియా చీఫ్ అశు ఖుల్లర్ మాత్రం.. ఆర్ బీఐ అనుమతి వచ్చే వరకు తాము సేవల్ని యథావిధిగా అందిస్తామని పేర్కొన్నారు.

భారత్ లో  సిటీ బ్యాంక్ 1902 నుంచి కన్స్యూమర్ సేవల్ని అందిస్తోంది. ప్రస్తుతం నిర్వహిస్తున్న బ్యాంకింగ్ సేవల నుంచి వైదొలిగిన తర్వాత ఇనిస్టిట్యూషనల్ బ్యాంకింగ్ తో పాటు ఆఫ్ షోర్.. గ్లోబల్ బిజినెస్ సపోర్టు పై ఫోకస్ పెట్టనున్నట్లుగా సిటీ బ్యాంక్ చెబుతోంది. దేశీంలోని కొన్ని ప్రధాన నగరాల్లో ఈ సేవల్ని అందించనున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ముంబయి.. ఫుణె.. బెంగళూరు.. చెన్నై.. గురుగ్రామ్ ల ద్వారా ఈ సేవల్ని అందించనున్నారు.
Tags:    

Similar News