బొగ్గు స్కాంలో దాస‌రి.. అస‌లేం జ‌రిగింది?

Update: 2017-05-31 04:02 GMT
తెలుగు చ‌ల‌న‌చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఒక వెలుగు వెల‌గ‌ట‌మే కాదు.. టాలీవుడ్‌కు పెద్ద దిక్కుగా వ్య‌వ‌హ‌రించే దాస‌రి రాజ‌కీయాల్లోనూ ప్ర‌ముఖుడే. మ‌న్మోహ‌న్ సింగ్ ప్ర‌ధానిగా వ్య‌వ‌హ‌రించిన కాలంలో ఆయ‌న కొంత‌కాలం కేంద్ర స‌హాయ మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. యూపీఏ స‌ర్కారును ఉక్కిరిబిక్కిరి చేసిన ప‌లు కుంభ‌కోణాల్లో ఒక‌టి బొగ్గు కుంభ‌కోణం. దీనికి సంబంధించిన స‌మాచారాన్ని 2012లో కాగ్ బ‌య‌ట‌పెట్టింది.

ఒక ద‌శ‌లో 2జీ స్కాం కంటే కూడా ఎక్కువ దోపిడీ బొగ్గు కుంభ‌కోణంలో జ‌రిగిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అప్ప‌ట్లో బొగ్గు శాఖ స‌హాయ‌మంత్రిగా దాస‌రి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. దీంతో.. బొగ్గు కుంభ‌కోణానికి సంబంధించిన మ‌సి దాస‌రికి అంటుకుంది. దాస‌రితో పాటు కాంగ్రెస్ పార్టీకి చెందిన పారిశ్రామిక‌వేత్త న‌వీన్ జిందాల్‌ కు సైతం ఈ కుంభ‌కోణంలో భాగస్వామ్యం ఉంద‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి.

ఇంత‌కీ.. ఈ బొగ్గు స్కాంను ఒక్క మాట‌లో చెప్పాలంటే.. బొగ్గు గ‌నుల కేటాయింపులో అక్ర‌మాల‌కు పాల్ప‌డ‌ట‌మే ఈ కుంభ‌కోణం. 2006-09 మ‌ధ్య కాలంలో బొగ్గు గ‌నుల శాఖ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ ద‌గ్గ‌రే ఉంది. బొగ్గు నిల్వ‌ల కేటాయింపుల్లో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని.. దాదాపు వంద ప్రైవేటు కంపెనీలు..విద్యుత్‌.. స్టీల్.. సిమెంటు ప‌రిశ్ర‌మ‌ల‌కు చెందిన కొన్ని ప‌బ్లిక్ సెక్టార్ కంపెనీలు బొగ్గు నిల్వ‌ల్ని చాలా త‌క్కువ ధ‌ర‌కే కొట్టేసిన‌ట్లుగా కాగ్ బ‌య‌ట‌కు తీసుకొచ్చింది. దీంతో.. ఈ వ్య‌వ‌హారం అప్ప‌ట్లో పెను సంచ‌ల‌నానికి తెర తీసింది.

బొగ్గు గ‌నుల్ని కేటాయించ‌టానికి స‌రైన విధానాలు లేక‌పోవ‌టంతో అర‌కొర‌గా ఉన్న పాత ప‌ద్ధ‌తులే కొనసాగాయి. దీంతో అక్ర‌మాల‌కు తెర తీసిన‌ట్లైంది. 2004లో యూపీఏ ప‌వ‌ర్‌ లోకి వ‌చ్చిన త‌ర్వాత బొగ్గు గనుల్లో త‌వ్వ‌కాల‌కు కేటాయింపులు రాష్ట్ర ప్ర‌భుత్వాల సిఫార్సుల ఆధారంగానే కేంద్రం ప్రైవేటు సంస్థ‌కు అనుమ‌తుల్ని మంజూరు చేసింది.

బొగ్గు గ‌నుల్ని ప్ర‌భుత్వ‌..ప్రైవేటు సంస్థ‌ల‌కు ఏక‌ప‌క్షంగా క‌ట్ట‌బెట్ట‌టం ఎందుకు? వేలం ప‌ద్ధ‌తిలో ఎందుకు అమ‌లు చేయ‌లేద‌న్న ప్ర‌శ్న‌కు స‌మాధానం లేని ప‌రిస్థితి. బొగ్గు కేటాయింపుల వ్య‌వ‌హారాన్ని క్యాబినెట్ లో చ‌ర్చ‌కు  కూడా పెట్ట‌లేదు. బొగ్గుగ‌నుల మంత్రిత్వ శాఖ ఏక‌ప‌క్షంగా పాత ప‌ద్ధ‌తుల్లోనే గ‌నుల్ని కేటాయించింది. దీనిపై కాగ్ దృష్టి పెట్ట‌టంతో ఈ వ్య‌వహారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దాస‌రి మీద ఆరోప‌ణ‌లు వ‌చ్చిన‌ప్ప‌టికీ.. అందుకు నిరూపించ‌ద‌గ్గ ఆరోప‌ణ‌లు చాలా త‌క్కువ‌గా ఉండ‌టం గ‌మ‌నార్హం. బొగ్గు గ‌నుల కేటాయింపుల కుంభ‌కోణంలో దాసరి పేరు వినిపించిన‌ప్ప‌టికీ.. ఇప్ప‌టివ‌ర‌కూ ఆయ‌న‌కు దీంతో సంబంధం ఉంద‌న్న మాట‌కు బ‌లం చేకూరేలా ఆరోప‌ణ‌లు పెద్ద‌గా రాలేద‌న్న మాట వినిపిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News