ఆర్ ఎస్ ఎస్ అధిప‌తిపై కేసు పెట్టిన వీహెచ్!

Update: 2019-12-30 09:29 GMT
ఇటీవ‌లే తెలంగాణ‌లో జ‌రిగిన రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ స‌మావేశంలో ఆ సంస్థ అధ్య‌క్షుడు మోహ‌న్ భ‌గ‌వ‌త్ హాట్ కామెంట్స్ చేసిన సంగ‌తి తెలిసిందే. భార‌త దేశంలో ఉన్న వాళ్లంతా హిందువులే అని ఆర్ ఎస్ ఎస్ అధిప‌తి తేల్చారు. మ‌రో మ‌తవిశ్వాసానికి దేశంలో స్థానం లేద‌న్న‌ట్టుగా ఆయ‌న మాట్లాడారు. దేశ జ‌నాభా 130 కోట్లు అని, వారంతా హిందువులే అని ఆయ‌న వ్యాఖ్యానించారు.

అది ఆర్ ఎస్ ఎస్ కు మొద‌టి నుంచి ఉన్న అజెండానే. భార‌త దేశంలో ఉన్నారంటే వారంతా హిందువులే అన్న‌ట్టుగా ఆ సంస్థ స్పందిస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు సంఘ్ ప‌రివార్ ఫుల్ ఫామ్ లో ఉంది. దీంతో ఆ సంస్థ అధినేత వ్యాఖ్య‌ల‌పై ఎవ‌రూ పెద్ద‌గా స్పందించ‌లేదు.

కానీ తెలంగాణ కాంగ్రెస్ నేత వీ హ‌నుమంత‌రావు మాత్రం ఊరికే ఉండ‌లేదు. మోహ‌న్ భ‌గ‌వ‌త్ పై ఆయ‌న పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దేశంలో ఉన్న నూటా ముప్పై కోట్ల మందీ హిందువులే అని ఆయ‌న అన‌డం స‌రికాద‌ని, ఆ మాట‌తో ఇత‌ర మ‌తాల వారి మ‌నోభావాల‌ను భ‌గ‌వ‌త్ కించ‌ప‌రిచార‌ని వీహెచ్  త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు.

మ‌త సామ‌ర‌స్యాన్ని దెబ్బ‌తీసిన మోహ‌న్ భ‌గ‌వ‌త్ పై చ‌ర్య‌లు తీసుకోవాలంటూ ఆయ‌న త‌న ఫిర్యాదును చేశారు. ఇలా ఆర్ఎస్ఎస్ చీఫ్ వ్యాఖ్య‌ల విష‌యంలో ఆయ‌న‌పై తెలంగాణ‌లో కంప్లైంట్ రిజిస్ట‌ర్ అయ్యింది.

   

Tags:    

Similar News