కాంగ్రెస్ కు ఆ హోదా వద్దట..!

Update: 2019-06-02 13:52 GMT
వరసగా రెండో సారి కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ హోదా దక్కలేదు. గత ఎన్నికల్లో అంటే ఏదో తీవ్రమైన ప్రజా వ్యతిరేకతతో కాంగ్రెస్ చిత్తు అయిపోయిందనుకుంటే, ఈ సారి కూడా కాంగ్రెస్  కు అదే పరిస్థితి వచ్చింది. ఈ సారి కాంగ్రెస్ కు నామమాత్రంగా సీట్ల సంఖ్య పెరిగినా ఆనందపడటానికి ఏమీ లేదు.

స్వయంగా రాహుల్ గాంధీ ఎంపీగా ఓడిపోతే కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో దక్కే ఆనందం  ఏముంటుంది? సీట్లు అయితే ఎనిమిది పెరిగాయి. కానీ వాటి ద్వారా కూడా కాంగ్రెస్ పార్టీకి లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష హోదా అనేది దక్కదు. కాంగ్రెస్ కేవలం ప్రతిపక్ష పార్టీగానే ఉంటుంది.

కనీసం పదో వంతు సీట్లను సాధించలేకపోతే చట్టసభలో ప్రధాన ప్రతిపక్షహోదా దక్కదు. అయితే అధికార పక్షం అనుకుంటే.. ప్రధాన ప్రతిపక్షహోదాను ఇవ్వొచ్చు. కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా స్పీకర్ గుర్తించవచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ హోదా వద్దని అంటోంది!

మరో మూడు ఎంపీ సీట్లు దక్కి ఉంటే కాంగ్రెస్ పార్టీ లోక్ సభలో ప్రధాన ప్రతిపక్షం అనే హోదాను సంపాదించుకునేది. ప్రస్తుతానికి అయితే అది దక్కదు. కాబట్టి.. కాంగ్రెస్ పార్టీ వాళ్లు  ఈ అంశం మీద స్పందిస్తున్నారు. తాము ప్రధాన ప్రతిపక్ష హోదాను కోరడం లేదని తేల్చి చెప్పారు. తాము కేవలం ప్రతిపక్ష పార్టీగానే కొనసాగుతామంటూ కాంగ్రెస్ నేతలు ప్రకటించారు! కోరినా మోడీ వైపు నుంచి గ్రీన్ సిగ్నల్ రాకపోవచ్చు. అందుకే కాంగ్రెస్ వాళ్లు తామే ఆ హోదాను త్యాగం చేసేసినట్టుగా ప్రకటించుకున్నట్టుగా ఉన్నారు!
Tags:    

Similar News