ఎన్నిక‌ల వేళ ఆ నేత‌ల‌ను ప‌క్క‌న‌పెట్టిన కాంగ్రెస్‌

Update: 2022-02-05 07:40 GMT
అయిదు రాష్ట్రాల ఎన్నిక‌ల సంద‌డితో దేశ రాజ‌కీయాలు వేడెక్కుతున్నాయి. పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప‌ట్టు నిలుపుకోవ‌డంతో పాటు మిగ‌తా రాష్ట్రాల్లోనూ పంజా విస‌రాల‌ని చూస్తోంది. మ‌రోవైపు గోవా, మ‌ణిపుర్‌, ఉత్త‌రాఖండ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల‌ను త‌మ చేజారి పోకుండా బీజేపీ గ‌ట్టిగానే ప్ర‌య‌త్నిస్తోంది. అయితే పంజాబ్‌లో కాంగ్రెస్ వైఖ‌రిపై మాత్రం భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న చోట పార్టీలో నేత‌ల మ‌ధ్య విభేదాలు, అసంతృప్తి కార‌ణంగా వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీకి చేటు జ‌రిగే వీలుంద‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థి రేసులో ప్ర‌స్తుత సీఎం చ‌ర‌ణ్‌జిత్ సింగ్ చ‌న్నీ, పీసీసీ అధ్య‌క్షుడు న‌వ్‌జోత్‌ సింగ్ సిద్ధూ ఉన్నారు. దీనిపై అధిష్ఠానం ఓ నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది.

పంజాబ్‌లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ కాంగ్రెస్ తీసుకున్న ఓ నిర్ణ‌యంతో పార్టీ నేత‌ల అసంతృప్తి మ‌రోసారి బ‌య‌ట‌ప‌డింది. ఆ రాష్ట్రంలో ఎన్నిక‌ల ప్ర‌చారం కోసం పార్టీ ప్ర‌క‌టించిన స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో కీల‌క నేత‌లు గులాం న‌బీ అజాద్‌, మ‌నీశ్ తివారీ పేర్లు లేక‌పోవ‌డం చర్చ‌నీయాంశంగా మారింది. సీఎం చ‌ర‌ణ్‌జిత్‌, న‌వ్‌జోత్ సింగ్‌, మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్‌, పార్టీ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ త‌దిత‌ర 30 మంది నేత‌ల‌ను  కాంగ్రెస్  స్టార్ క్యాంపెయిన‌ర్లుగా పేర్కొంది. గులాం న‌బీ అజాద్‌, మ‌నీశ్‌ను పార్టీ ప‌క్క‌న‌పెట్ట‌డం గ‌మ‌నార్హం.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ఎన్నిక‌ల కోసం ప్ర‌క‌టించిన స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో గులాం న‌బీ అజాద్ పేరు ఉంది.  ఆ త‌ర్వాతి రోజే ఆయ‌న‌కు కేంద్రం ప‌ద్మ భూష‌న్ అవార్డు ప్ర‌క‌టించింది. ఈ అవార్డులు ప్ర‌క‌టించిన త‌ర్వాత విడుద‌ల చేసిన తొలి జాబితా అయిన పంజాబ్ ఎన్నిక‌ల స్టార్ క్యాంపెయిన‌ర్ల‌లో గులాం న‌బీ అజాద్‌ను ప‌క్క‌న‌పెట్టారు. మ‌రోవైపు పంజాబ్ నుంచి లోక్‌స‌భ ఎంపీగా ఉన్న మ‌నీశ్ తివారీని ప‌ట్టించుకోక‌పోవ‌డం విస్మ‌యాన్ని క‌లిగించింద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. రాష్ట్రంలో 40 శాతానికి పైగా ఉన్న హిందూ వ‌ర్గానికి ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కీల‌క నేత‌ల్లో ఆయ‌న ఒక‌రు. పార్టీ ప్ర‌చారంలోనూ కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అలాంటిది ఆయ‌న పేరు లేక‌పోవ‌డంపై చ‌ర్చ ఊపందుకుంది.

అయితే ఈ ఇద్ద‌రు నేత‌లు కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నాయకుల‌తో నిండిన గ్రూప్ ఆఫ్ 23 (జీ-23)లో ఉన్నారు. పార్టీలో అంత‌ర్గ‌త సంస్క‌ర‌ణ‌లు కోరుతూ పార్టీలోని ఈ 23 మంది నేత‌లు సోనియా గాంధీకి గ‌తంలో లేఖ రాసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో తాజాగా పంజాబ్ స్టార్ క్యాంపెయిన‌ర్ల జాబితాలో మ‌నీశ్ పేరు లేక‌పోవ‌డంపై ఆయ‌న స్పందించారు. పార్టీ ఇలాంటి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని తెలుస‌ని, ఇంత‌కంటే భిన్నంగా ఏమైనా చేసి ఉంటే ఆశ్చ‌ర్య‌పోయేవాడిన‌ని చెప్పారు. అందుకు కార‌ణాలు కూడా అంద‌రికీ తెలుస‌ని వ్యాఖ్యానించారు. దీంతో అధిష్ఠానంతో ఆయ‌న‌కు భేదాభిప్రాయాలు ఉన్నాయ‌మే విష‌యం స్ప‌ష్ట‌మైంది.
Tags:    

Similar News