బద్వేల్ లో కాంగ్రెస్ ట్రంప్ కార్డు .... ?

Update: 2021-10-06 04:34 GMT
ఏపీలో ఇపుడు బద్వేల్ ఉప ఎన్నికల పోరు ఆసక్తిని కలిగిస్తోంది. బద్వేల్ లో అధికార వైసీపీ విజయం ఖాయం. మెజారిటీకి కూడా ఎలాంటి ఢోకా లేదు. మరి అన్నీ తెలిసి కూడా ఎందుకు పోటీ అంటే అక్కడే ఉంది రాజకీయం. ఎన్నికల్లో ఎపుడూ ఒకేలా సీన్ ఉండదు అన్న ధైర్యం ఒక వైపు, తమ ఉనికిని చాటుకోవడానికి ఇదే మంచి అవకాశం అన్న ఆలోచనలు మరో వైపు దీంతోనే జాతీయ పార్టీ కాంగ్రెస్ ఇక్కడ తన క్యాండిడేట్ ని ప్రకటించింది. ఎలాంటి హడావుడి చేయకుండా బీజేపీ మాదిరిగా ప్రకటనలు చేయకుండానే చాలా సైలెంట్ గా కాంగ్రెస్ అభ్యర్ధిగా పీఎం కమలమ్మ పేరును ఆ పార్టీ డిక్లేర్ చేసింది. కమలమ్మ పేరు ప్రకటించడం వెనక కాంగ్రెస్ పక్కా వ్యూహాన్నే ఎన్నుకుంది. ఏపీలో రెండు దఫాలుగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఒక్క సీటూ కూడా పొందలేని కాంగ్రెస్ ఉప ఎన్నికలో మాత్రం తెలివిగానే పావులు కదిపింది అంటున్నారు.

ఇంతకీ ఈ కమలమ్మ ఎవరు ఏంటి అంటే చాలానే కధ ఉంది. ఆమె సామాన్యురాలు మాత్రం కాదు, 2009 ఎన్నికల్లో వైఎస్సార్ హవాలో ఆమె బద్వేల్ నుంచి ఏకంగా 78 వేల పై చిలుకు ఓట్లను సాధించింది. అలాగే టీడీపీ అభ్యర్ధి మీద 37 వేల మెజారిటీని  ఆమె నాడు తెచ్చుకుంది. ఇక దానికి ముందు చూస్తే టీడీపీ మూడు ఎన్నికల్లో గెలిచి స్ట్రాంగ్ అయింది. అలాంటి పార్టీని కమలమ్మ  ఒక్క లెక్కన ఓడించారు. ఇక వైఎస్సార్ మరణానంతరం ఆమె జగన్ వైపు మొగ్గు చూపారు. కొంతకాలం ఆమె జగన్ వర్గంలో ఉన్నారు కూడా. ఎపుడైతే జగన్ కాంగ్రెస్ నుంచి వేరు పడ్డారో ఆమె కాంగ్రెస్ కే కట్టుబడి ఉండిపోయారు. ఆ తరువాత ఆమెకు కాంగ్రెస్ కూడా 2014, 2019 ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు. అయితే 2009 తరువాత జరిగిన అనేక ఆసక్తికరమైన రాజకీయ పరిణామాల నేపధ్యంలో బద్వేల్ ఎమ్మెల్యే గా కమలమ్మ పేరు కూడా ఎక్కువగా వినిపించేది. ఆమె జగన్ వైపు ఉంటే నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆమెని తిరిగి కాంగ్రెస్ వైపు వచ్చేలా చక్రం తిప్పారు. ఒక విధంగా  చెప్పాలి అంటే ఆమె వైఎస్సార్ కుటుంబానికి వీర  విధేయురాలుగానే ముద్ర పడ్డారు.

ఇన్నాళ్ళూ ఆమె రాజకీయంగా పెద్దగా లేకపోయినా కూడా తనకంటూ ఒక ఇమేజ్ ని మాత్రం తెచ్చుకున్నారు. ఇక 2014, 2019 ఎన్నికల్లో బద్వేల్ లో వైసీపీ విజయ ఢంకా మోగించింది. ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలు నల్లేరు మీద బండి లాంటివేనని అధికార పార్టీ అభిప్రాయపడుతోంది. అయితే కమలమ్మ అభ్యర్ధిత్వం మాత్రం కొంత చర్చకు తావిస్తోంది. నాడు వైఎస్సార్ మరణం తరువాత తొలిగా జగన్ కి మద్దతు ప్రకటించి ఆ కుటుంబం పట్ల తన అభిమానాన్ని చాటుకున్న కమలమ్మ జగన్ పార్టీకి  ప్రత్యర్ధిగా ఉండడమే ఆసక్తికరం. మరి ఆమె కూడా వైఎస్సార్ పేరునే చెప్పుకుని ఎన్నికల్లో ప్రచారం చేస్తారు. మరో వైపు వైసీపీ అభ్యర్ధిగా డాక్టర్ సుధ ఉన్నారు. మరి ఈ పోటీ ఎలా చూడాలి అంటే వైఎస్సార్ వర్సెస్ వైసీపీగానే అని అంటున్నారు. ఒక రకంగా వైసీపీకి కమలమ్మ అభర్య్ధిత్వం కొంత ఇబ్బందికరమే అంటున్నారు. ఏది ఏమైనా అధికార పార్టీ కాబట్టి ఘన విజయం తధ్యం అయినా ఈ ఎన్నికల ద్వారా అనేక విషయాలు మాత్రం చర్చకు వస్తాయని అంటున్నారు. మొత్తానికి కాంగ్రెస్ తన ట్రంప్ కార్డు గా కమలమ్మను బయటకు తీయడం మాత్రం సేఫ్ గేమ్ గానే చూడాలి.
Tags:    

Similar News