అనేక ఉత్కంఠల మధ్య...ఓ కొలిక్కి వచ్చిన కన్నడ రాజకీయం హాట్ హాట్ వార్తలకు దూరంగా ఉంటుందని భావించిన వారికి ఊహించని ట్విస్ట్ ఇస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయమై ఆసక్తి నెలకొనగా - ఇప్పుడు ఏ వ్యక్తికి ఏం పదవి వస్తుందనే విషయంలో అదే సస్పెన్స్ కొనసాగుతోంది.
షరామూములగానే...కూటమిగా ఉన్న పార్టీలకు చెందిన నేతలు ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నారు కర్ణాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం కొలువుదీరి వారమవుతున్నా ఇంకా క్యాబినెట్ విస్తరణ కొలిక్కిరాలేదు. ఇరు పార్టీల మధ్య అధికారాలు-శాఖల పంపకం- కాంగ్రెస్ కు రెండు డిప్యూటీ సీఎం పదవులివ్వడం వంటి అంశాలపై స్పష్టత రాకే క్యాబినెట్ విస్తరణ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తున్నది.కీలక ఆర్థిక - రెవెన్యూ - పీడబ్ల్యూడీ - ఇంధనం శాఖలను కాంగ్రెస్ కోరుతున్నట్లు సమాచారం.
అసెంబ్లీలో బల నిరూపణ తర్వాత సీఎం కుమారస్వామి - కర్ణాటక కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానంతో పలుమార్లు చర్చించారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నా సీఎం పదవిని వదులుకున్న కాంగ్రెస్.. కీలక శాఖలు - రెండు డిప్యూటీ సీఎం పదవుల కోసం డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తం 22 మంత్రిపదవులను ఆశిస్తున్నది. ప్రధానంగా ఆర్థిక శాఖ చుట్టే ఇరుపార్టీల పంచాయితీ నడుస్తున్నది. 2004లో సీఎం ధరంసింగ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పుడు అప్పటి డిప్యూటీ సీఎం సిద్దరామయ్య ఆర్థిక శాఖను నిర్వహించారు. కనుక ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తమ నేత ఉన్నందున ఆర్థిక శాఖను తమకే వదిలేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సోమవారం ఢిల్లీలో కాంగ్రెస్ నేతలతో కుమారస్వామి భేటీ అస్పష్టంగానే ముగిసింది. దీంతో ఈ ట్విస్టులకు ఎప్పుడు తెరపడుతుందనేది తేలడం లేదు.మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన తల్లి సోనియా వైద్య పరీక్షల కోసం అమెరికాలో ఉన్నారు. వారు వచ్చాక ఓ స్పష్టత వస్తుందని ఇరుపార్టీల నేతలు భావిస్తున్నారు. అయితే, కన్నడ పరిస్థితులపై విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ స్పందించారు. దయచేసి కన్నడలో పరిపాలన మొదలుపెట్టండి అంటూ ఆయన సెటైర్ వేశారు.