కరోనా ఎఫెక్ట్...5జీ సేవలూ వెనక్కెళ్లాయిగా

Update: 2020-05-14 13:56 GMT
ప్రపంచ దేశాలను గడగడలాడించేస్తున్న కరోనా మహమ్మారి సాంకేతిక పరిజ్ఝానంలో అందుబాటులోకి రావాల్సిన అప్ డేట్లను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి. ఇప్పటికే కరోనా దెబ్బకు టెక్నాలజీ సంస్థలన్నీ భారీ కుదుపునకు గురి కాగా... తాజాగా టెక్నాలజీలో కొత్తగా వస్తున్న సేవలు కూడా వాయిదా పడిపోతున్నాయి. ఇందులో భాగంగా మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5జీ టెక్నాలజీ సేవలు కూడా కరోనా దెబ్బకు మరో రెండేళ్ల తర్వాత గానీ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదు. వినడానికి కాస్తంత విడ్డూరంగా ఉన్నా... 5జీ సేవలు కరోనా కారణంగానే ఏడాది ఆలస్యంగా 2022లో గానీ మనకు అందుబాటులోకి వచ్చే పరిస్థితి లేదట.

ఈ వ్యవహారానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. టెక్నాలజీ, టెలికాం పరిశ్రమల్లో ప్రణాళికాబద్ధంగా చేపట్టాల్సిన పనులపై కరోనా కారణంగా విపరీత జాప్యం చోటుచేసుకుంటోందట. టెలికాం శాఖ 5 జీ వేలంపై ఇటీవల నిర్వహించిన సమావేశంలో 2021లోనే వేలం ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లుగా చర్చ సాగిందట. వేలం ప్రక్రియలో జాప్యం జరిగితే... అది 5జీ పరీక్షలు సంబంధిత మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సిన లాంఛనాలు పూర్తి అయి 5జీ వాణిజ్య సేవలు 2022లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందట, అంటే... మనమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవల కోసం మనం మరో రెండేళ్ల పాటు నిరీక్షించక తప్పదన్న మాట.

కరోనా కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో మందగమనంతో పాటు 5జీ స్ప్రెక్ట్రమ్ బేస్ ధరను రూ.492 కోట్లుగా నిర్ణయించడం టెలికాం ఆపరేట్లకు ప్రధాన అవరోధంగా మారిందని నిపుణులు చెబుతున్నారు. భారత్ లో బేస్ ధర అత్యధికంగా ఉందని టెలికాం దిగ్గజాలు వోడాఫోన్-ఐడియా, భారతీ ఎయిర్ టెల్, రిలయన్స్ జియో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు భారత 5జీ ప్రణాళికల్లో చైనా ఎలక్ట్రానిక్ దిగ్గజాలు హువాయే, జడ్ టీజీల పాత్రపై కొనసాగుతున్న అనిశ్చితి సైతం భారత్ లో 5జీ ఎంట్రీని సంక్లిష్టం చేస్తున్నాన్న వార్తలూ వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే... భారత టెలికాం రంగంలో తీవ్ర పోటీతో స్వల్ప మార్జిన్లతోనే టెలికాం ఆపరేటర్లు నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో ఆ సంస్థలు 5జీ సేవల కోసం భారీ నిధులను వెచ్చించేందుకు సిద్దంగా కూడా లేవట. అంతేకాకుండా కరోనా నేపథ్యంలో ఖరీదైన 5జీ ప్లాన్లకు వినియోగదారుల నంచి ఏమేర స్పందన ఉంటుందనేది కూడా టెలికాం సంస్థలను అడుగు ముందుకేయించడం లేదట మొత్తంగా కరోనా దెబ్బకు 5జీ ఎంట్రీపై తీవ్ర సందిగ్దత ఏర్పడటంతో పాటుగా ఆ సేవల ఎంట్రీ కూడా హీనపక్షం రెండేళ్ల పాటు వాయిదా పడిపోయిందని చెప్పక తప్పదు.


Tags:    

Similar News