కరోనా ఎఫెక్ట్ : ఢిల్లీలో హై అలర్ట్ .. 144 సెక్షన్ అమలు !

Update: 2020-03-19 10:10 GMT
కరోనా వైరస్ భారత్ లో చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది. దేశ రాజధాని ఢిల్లీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండటం తో ఢిల్లీలో కరోనా ఆంక్షలు విధించింది. ఢిల్లీ వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేశారు. అవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని ఢిల్లీ పోలీస్ కమిషనర్ శ్రీవాస్తవ గురువారం (మార్చి 19,2020) ఆదేశాలు ఇచ్చారు. ఎవరైనా ఈ ఆదేశాల్ని మీరి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని , ఎట్టి పరిస్థితుల్లో ర్యాలీ, నిరసనలు, వినోద ప్రదర్శనల్లో పాల్గొనొద్దని సీపీ వార్నింగ్ ఇచ్చారు.

ఢిల్లీలో మార్చి 31వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని , కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో , దాన్ని అరికట్టడానికి ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇవన్నీ తీసుకుంటున్నామని, ప్రజలు కరోనా గురించి భయపడాల్సిన పని లేదని సీపీ స్పష్టం చేశారు. ఇప్పటికే నాగ్ పూర్, ముంబై లో 144 సెక్షన్ అమల్లో ఉంది. ప్రజలు గుమిగూడకుండా చేయడం ద్వారా కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయొచ్చని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలు కూడా కఠిన చర్యలు అమల్లోకి తీసుకువచ్చాయి.

కాగా, ఢిల్లీకి ఎయిర్ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. వివిధ దేశాల నుంచి తీసుకొస్తున్న వారిని ఢిల్లీలోని క్వారంటైన్ లో ఉంచుతున్నారు. అలాగే, సీఏఏకు వ్యతిరేకంగా వరుసగా నిరసన దీక్షలు చేస్తున్న షహీన్ బాగ్ లో నిరసనకారులను ఖాళీ చేయాలని ఇప్పటికే పోలీసులు ఆదేశించారు. ప్రజల భద్రతని దృష్టిలో పెట్టుకొని తమ నిరసనలని కొన్ని రోజులు వాయిదా వేసుకోవాలని కోరుతున్నారు.
Tags:    

Similar News