మానవత్వాన్ని చంపేస్తోన్న కరోనా!!

Update: 2020-07-20 05:30 GMT
కరీంనగర్ మార్కెట్ లో కూరగాయలు కొనడానికి వచ్చి గుండెపోటుతో ఓ వ్యక్తి కుప్పకూలాడు. కరోనా భయంతో అతడి దగ్గరకు ఎవరూ వెళ్లలేదు. తాజాగా నిన్న గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో నడిరోడ్డుపై ఓ కరోనా రోగి కుప్పకూలి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. అతడి కుటుంబం కూడా రోడ్డుపైనే వదిలేసింది. ఈ ఇద్దరినీ అనాథ శవాల్ల వదిలేయడంతో మున్సిపల్ సిబ్బంది తీసుకెళ్లి దహన సంస్కారాలు చేశారు. ఇలా కరోనా మనుషుల్లోని మానవత్వాన్ని చంపేస్తోంది. భయాన్ని సృష్టిస్తోంది. బంధాలను దూరం చేస్తోంది.

కరోనా భయం జనాన్ని ఎంతలా ఆవహించిందో పై రెండు సంఘటనలు రుజువు చేస్తున్నాయి. చైనా నుంచి వచ్చిన మాయదారి కరోనాతో మనషుల్లో మానవత్వం చచ్చిపోతోంది. కుటుంబంలోని వ్యక్తికి కరోనా వచ్చినా దూరం పెడుతున్నారు. చనిపోతే చివరి చూపుకు కూడా నోచుకోకుండా పడేస్తున్నారు.

పట్నమైనా.. పల్లె అయినా ఇప్పుడు చావంటే భయం.. చచ్చారంటే కనీసం దగ్గరకు కూడా పోని పరిస్థితి. తుమ్మినా.. దగ్గినా వెలివేసినట్టే చూస్తున్నారు. కరోనా ధాటికి మనుషులు నిర్ధయగా మారిపోతున్నారు. చనిపోతే అనాథ శవాల్లా వదిలేస్తున్నారు.

మొన్నటికి మొన్న పెద్దపల్లిలో ఓ వ్యక్తి చనిపోతే ఎవరూ శవాన్ని తీసుకుపోకపోతే డాక్టర్ స్వయంగా ట్రాక్టర్ నడిపి ఆ కరోనా రోగికి అంత్యక్రియలు నిర్వహించారు.

ఒకప్పుడు చావంటే అతడి అంత్యక్రియలను బంధువులంతా చివరి చూపు చూసి ఘనంగా అంతిమ సంస్కారాలు చేసేవారు. అతడు మేలు చేసిన వారంతా వచ్చి పాడెమోసి మరీ ర్యాలీగా పోయేవారు. కానీ నేడు చావంటే దారుణం.. నడిరోడ్డులో వదిలేస్తున్న వైనం..

చావే కాదు.. పెళ్లిళ్లు పేరంటాలు అంతే.. ఏ ఒక్కరూ ఈ సామూహిక వ్యాప్తి దశలో కరోనా భయానికి ఎవరూ ఎవరిని పట్టించుకోని పరిస్థితి నెలకొంది. మనుషుల్లో మానవత్వం మంటగలిసి అందరూ వెలివేస్తున్న దుస్థితి. కరోనాకు మందు కనిపెట్టాలి లేదంటే.. వ్యాక్సిన్ వచ్చేదాకా ఈ అమానవీయత పోయేలా లేదు. ఈ దారుణాలు ఆగేలా కనిపించడం లేదు.
Tags:    

Similar News