తెలంగాణ‌లో గేరు మారుద్దాం

Update: 2018-08-28 04:37 GMT
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు దాదాపు ఖరారు అయిపోయాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర స‌మితి దూకుడుగా వ్యవహరిస్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే దూకుడు మీద ఉంది. ఇక తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో కలిసి పొత్తు పెట్టుకోవాలని ఆరాటపడుతోంది. భారతీయ జనతా పార్టీ కూడా ఎన్నికలకు తాము సిద్ధమే అని సంకేతాలు ఇస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అంతో ఇంతో బలం - బలగం ఉన్న వామపక్ష పార్టీలైన సిపిఎం - సిపిఐల వైఖరే ఇంకా స్పష్టం కావాల్సి ఉంది. ఈ రెండు పార్టీలు పైకి కలిసి ఉన్నట్లు అనిపించినా అంతర్గతంగా మాత్రం ఈ రెంటికి మధ్య పొసగదనేది వాస్తవం. దీంతో ఒకరు పొత్తుకు వెళ్లాలనుకుంటే... మరొకరు వద్దు అని వాదిస్తున్నారు.

తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి - ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు పరాజయమే లక్ష్యంగా పొత్తులు కుదుర్చుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ భావిస్తోంది. ఇందుకు భిన్నంగా భారత కమ్యూనిస్టు (మార్క్సిస్టు) పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీతో ససేమిరా పొత్తు వద్దని వారిస్తోంది. జాతీయ స్ధాయిలో భారతీయ జనతా పార్టీ - కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగా ఏర్పడే కూటమితో జత కట్టాలన్నది సిపిఎం భావన‌. అయితే సిపిఐ మాత్రం జాతీయ స్ధాయి రాజకీయాలకు - రాష్ట్ర రాజకీయాలకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని - ముఖ్యంగా తెలంగాణలో స్ధానిక అవసరాలను బట్టి పొత్తులు పెట్టుకోవాలని భావిస్తోంది.

దేశవ్యాప్తంగా భావ సారూప్యం ఉన్న వామపక్షాల కూటమి అయిన బహుజన వామపక్ష కూటమిలో సిపిఎం ప్రధాన భాగస్వామి. ఈ కూటమిలో దేశంలోని అన్ని వామపక్ష పార్టీలు ఉన్నాయి. దాదాపు 29 పార్టీలున్న ఈ కూటమికి సిపిఎం నేతృత్వం వ‌హిస్తోంది. ఇప్పుడు తెలంగాణలో ఒక్క కె.చంద్రశేఖర రావును ఓడించాలనే కారణంతో ఆ పార్టీలను తోసిరాజని కాంగ్రెస్ తో కలవడంపై సిపిఎంకు భిన్న అభిప్రాయాలున్నాయి. అయితే సిపిఐ మాత్రం తెలంగాణలో ఉన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని జాతీయ స్ధాయిలో ఉన్న కూటమిలోని పార్టీలకు సర్దిచెప్పి తెలంగాణ మేరకు కాంగ్రెస్ పార్టీతో కలవాలని భావిస్తోంది. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర నాయకులు చాడ వెంకటరెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర రెడ్డికి చెప్పినట్లు సమాచారం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపై వామపక్షాల్లోనే తలో మాట వినిపిస్తోంది.  
    

Tags:    

Similar News