పాజిటివ్ వచ్చిందంటే.. పకోడీలు వేసి వస్తానన్నాడు

Update: 2021-04-12 10:30 GMT
కరోనా మాట విన్నంతనే ఆమడ దూరం పారిపోయే రోజులు పోయాయా? అంటే పోలేదు. కానీ.. తెలీని భయం ఇప్పటికి వెంటాడుతున్నా.. కొందరిలో మాత్రం అందుకు భిన్నమైన నిర్లప్తత.. తప్పదులే అన్నట్లుగా తెగించేసిన వైనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. కరోనా మొదటిదశలో ఉన్నప్పుడు తీసుకున్న జాగ్రత్తల్ని.. చాలామంది ఇప్పుడు పాటించటం లేదు. ఇదే పెద్ద సమస్యగా మారింది. తాజాగా ఇలాంటి తీరుకు పరాకాష్ఠ అన్న ఉదంతం ఒకటి ఏపీలోని శ్రీకాకుళం జిల్లాలో చోటు చేసుకుంది.

పలాస మున్సిపాలిటీ ఓల్డ్ నేషనల్ హైవే మీద ఒక పకోడీ దుకాణం ఉంది. ఆ షాపు యజమాని ఇటీవల సందేహం వచ్చి కరోనా పరీక్ష చేయించుకున్నాడు. తాజాగా అతడికి పాజిటివ్ అన్న విషయం తేలింది. దీంతో.. అతనికి సిబ్బంది ఫోన్ చేసి.. పాజిటివ్ వచ్చింది.. ఆసుపత్రికి వెళ్లాలని ఫోన్ చేశారు. దీనికి.. సదరు పకోడీ షాపు యజమాని ఇచ్చిన సమాధానం ఏమిటో తెలుసా?

పకోడి పిండి ఇప్పుడే కలిపాం. పకోడి నాలుగు వాయలు వేసేసి వస్తామని బదులిచ్చాడు. అతడి మాటలు విన్న ఆరోగ్య సిబ్బందికి నోట మాట రాలేదు. వెంటనే తేరుకొని.. తీవ్రంగా మందలించి.. వెంటనే అక్కడకు 108 పంపారు. అతడ్నిబలవంతంగా వాహనం ఎక్కించి చికిత్స అందిస్తున్నారు. కరోనా పాజిటివ్ వచ్చినా.. పకోడి వేస్తానని చెప్పటం.. తన కారణంగా మరికొందరికి వైరస్ అంటుందన్న భయం లేకపోవటం షాకింగ్ గా మారింది.
Tags:    

Similar News