కుంభ‌కోణాల‌కు వేల కోట్లు త‌గ‌లేశారు.. కానీ, వ్యాక్సిన్ మాత్రం ఫ్రీగా ఇవ్వ‌రా?

Update: 2021-04-29 10:22 GMT
దేశంలో క‌రోనా తీవ్ర‌స్థాయిలో జ‌డ‌లు విప్పింది. ఆ రాష్ట్రం.. ఈ రాష్ట్రం.. అని తేడాలేదు. విస్త‌రించ‌డంలో త‌న‌కు తానే సాటి అన్న ట్టుగా `అందుగ‌ల‌దిందులేద‌ను` సందేహం లేద‌న్న‌ట్టుగా.. కొవిడ్ వైర‌స్ విస్త‌రించేసింది. ఈ క్ర‌మంలో.. ప్ర‌జ‌లు పిట్ట‌లు రాలిన‌ట్టు రాలుతున్నారు. వైద్య స‌దుపాయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇక‌, పేద‌లు, వేత‌న జీవుల ప‌రిస్థితి ఏంటి? క‌రో నా కు వైద్యం, ఔష‌ధాలు.. వ్యాక్సిన్‌లు కూడా ఖ‌రీదైన నేప‌థ్యంలో.. వారు ఏం చేయాలి? క‌రోనా వ‌స్తే.. ప్రాణాలు ద‌క్కించుకోవ‌డం ఎలా? అనే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వ‌మే ఉచితంగా ఎందుకు పంపిణీ చేయ‌కూడ‌దు?  అంత ధ‌ర‌, ఇంత ధ‌ర‌.. ఎందుకు ఈ బేర‌సారాలు! అనే చ‌ర్చ తెర‌మీదికి వ‌చ్చింది.

గ్రాస్ డొమెస్టిక్ ప్రొడ‌క్ట్‌(స్థూల జాతీయోత్ప‌త్తి)లో మ‌న దేశం ప్ర‌పంచంలోనే టాప్ 3 దేశంగా ఉంది. ఎందుకంటే.. మ‌న దేశంలో జ‌నాభా 139 కోట్ల పైచిలుకు ఉన్నారు. ఒక‌ప్పుడంటే.. ఉన్న‌త చ‌దువులు లేదా.. మాధ్య‌మికంగా అయినా.. చ‌దివే వారు పెద్ద‌గా క‌నిపించేవారు కాదు. కానీ, ఇటీవ‌ల కాలంలో చ‌దువుకున్న వారు పెరుగుతున్నారు. దీంతో వారంతా వివిధ‌రంగాల్లో రాణిస్తున్నారు. దీంతో జీడీపీ వృద్ధి చెంది.. ప్రపంచ స్థాయిలో మ‌న దేశం ఘ‌న‌త పొందింది. ఇక‌, ఎగుమ‌తుల విష‌యాన్ని చూసుకున్నా.. ఎక్క‌వే అయ్యాయి. ఫ‌లితంగా స్థూల జాతీయోత్ప‌త్తిలో మ‌న దేశం దూకుడుగా దూసుకుపోతోంద‌ని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

అయితే.. ఇక్క‌డే ఒక చిత్ర‌మైన ప‌రిస్థితి క‌నిపిస్తోంది. దేశం ఒక‌వైపు జీడీపీలో దూసుకుపోతుంటే.. కొంద‌రు మాత్రం ప్ర‌భుత్వ సాయంతో వేల కోట్లు బ్యాంకుల నుంచి దోచుకుంటున్నారు. ద‌ర్జాగా తిరుగుతున్నారు. మ‌రి వీరిని ప్ర‌భుత్వాలు ఏమీ చేయ‌లేవా? అంటే.. లేవ‌నే చెబుతున్నారు. అంతేకాదు.. ఇలా వేల కోట్ల రూపాయ‌ల్లో బ్యాంకులను నిండా ముంచేసిన నీర‌వ్ మోదీ.. విజ‌యం మాల్యా, చౌక్సీ వంటివారు విదేశాల‌కు చెక్కేసి.. మ‌న‌కే చుక్క‌లు చూపిస్తున్నారు. ఇక‌, వీరి దెబ్బ‌తో బ్యాంకులు దివాలా తీసే ప‌రిస్థితి వ‌చ్చేస్తోంది. దీంతో `ప్ర‌జాప్ర‌యోజ‌నం` అనే సాకును చూపి.. కేంద్రంలోని పెద్ద‌లు.. ఆ పెద్ద‌లు భోంచేసిన ప్ర‌జాధ‌నాన్ని.. `మాఫీ` లేదా.. వేరే రూపంలో బ్యాంకుల‌కు జ‌మ చేస్తోంది.

అంటే.. బ్యాంకుల‌ను దోచేసుకుని విదేశాల్లో పాగా వేసిన వారి అప్పుల‌ను కేంద్ర ప్ర‌భుత్వం ప‌రోక్షంగా మాఫీ చేస్తుండ‌గా.. ఇక్క‌డ ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని.. క‌రోనాతో పోరాడుతున్న పేద‌లు, వేత‌న జీవుల‌కు ``వ్యాక్సిన్‌``ను ఉచితంగా ఇచ్చేందుకు మాత్రం మ‌నసు అంగీక‌రించ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. వ్యాక్సిన్ విష‌యంలో చేస్తున్న తాత్సారమే దేశంలో క‌రోనా సెకండ్ వేవ్ విజృంభ‌ణ‌కు ప్ర‌ధాన కార‌ణంగా మారింద‌ని.. నిపుణులు చెబుతున్నారు. కుంభ‌కోణాలు, దోపిడీల సొమ్మును ప్ర‌భుత్వం వ‌సూలు చేసుకుని ఉంటే.. ఈ రోజు.. ప్ర‌తి ఒక్క‌రికీ వ్యాక్సిన్ ఉచితంగా వేసేవారు అని అంటున్నారు.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికైనా మేల్కొని.. బ్యాంకుల‌కు ఎగ్గొట్టిన బ‌డా బాబుల బాగోతాన్ని సీరియ‌స్‌గా తీసుకుని ఆ సొమ్ముల‌ను అణాపైస‌ల‌తో స‌హా వారి నుంచి క‌క్కిస్తే.. దేశంలో 80 కోట్ల మంది పేద‌లు/  వేత‌న జీవుల‌కు(ప్ర‌భుత్వ‌మే ఇంత మంది ఉన్నార‌ని చెప్పింది) వ్యాక్సిన్ అందించేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని, అదేస‌మ‌యంలో ఫార్మా కంపెనీల‌కు అడ్వాన్సులు ఇచ్చి మ‌రింత ఉత్ప‌త్తి పెంచేందుకు అవ‌కాశం క‌లుగుతుంద‌ని.. త‌ద్వారా దేశాన్ని క‌రోనా ర‌హితంగా చేయొచ్చ‌ని అంటున్నారు. మ‌రి మ‌న ఘ‌న‌త వ‌హించిన కేంద్ర పాల‌కులు ఈ దిశ‌గా దృష్టి పెడ‌తారా?  చూడాలి!!
Tags:    

Similar News