టీకా మొదటి డోసు తర్వాత కరోనా వస్తే.. రెండో డోసు మళ్లీ ఎప్పుడు?

Update: 2021-05-19 08:32 GMT
కొవిడ్ విలయతాండవం నేపథ్యంలో ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. భారత్ లోనూ తొలుత క్రియాశీలకంగా సాగిన టీకా పంపిణీ ప్రస్తుతం కొన్ని రాష్ట్రాల్లో మందకొడిగా కొనసాగుతోంది. వ్యాక్సిన్ తీసుకున్నా కొందరికి వైరస్ సోకింది. రెండు డోసులు తీసుకున్న అనంతరం పాజిటివ్ గా తేలింది. అయితే వారిలో ప్రమాద స్థాయి తక్కువ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. టీకా మొదటి మోతాదు అనంతరం వైరస్ సోకితే ప్రమాదం ఉంటుందా? మళ్లీ రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలని అనే సందేహాలు ఉన్నాయి.

టీకా తీసుకున్నంత మాత్రానా కరోనా సోకదనే నిర్లక్ష్యం ఏమాత్రం తగదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొదటి డోసు తీసుకున్న తర్వాత రోగ నిరోధక శక్తి కొంతవరకు మెరుగుపడుతుంది. అలాగని పూర్తి రక్షణ పొందినట్లు కాదని తెలిపారు. అయితే ప్రమాద స్థాయి కాస్త తక్కువే ఉంటుందని చెప్పారు. ఇక రెండో డోసు తీసుకునే వరకు కొవిడ్ నిబంధనలు విధిగా పాటించాల్సిందేనని నొక్కి చెబుతున్నారు. రెండు డోసులు తీసుకున్న వారికీ వైరస్ సోకుతుంది. కానీ ప్రమాదం చాలా తక్కువ స్థాయిలో ఉంటుందని వెల్లడించారు. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న కొవాగ్జిన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వి టీకాలు ఏవీ వంద శాతం సమర్థవంతమైనవి కావని... అవి ప్రమాద స్థాయిని మాత్రమే తగ్గిస్తాయని నిపుణులు పునరుద్ఘాటించారు.

తొలి డోసు తీసుకున్న తర్వాత వైరస్ సోకితే రెండో డోసు ఎప్పుడు తీసుకోవాలనే సందేహాలు చాలామందిలో ఉన్నాయి. వైరస్ సోకినా షెడ్యూల్ ను కోల్పోవద్దని నిపుణులు అంటున్నారు. మొదటి డోసు తర్వాత కొవిషీల్డ్ కు 8-12  వారాలు, కొవాగ్జిన్ కు 4-6 వారాల పాటు ఎదురు చూడాలి. ఈ సమయంలో పాజిటివ్ గా నిర్ధారణ అయితే పూర్తిగా కోలుకునే దాకా టీకా తీసుకోవద్దని సూచించారు. కనీసం ఆరు పాటు విరామం ఉండాలని చెబుతున్నారు. లక్షణాలను బట్టి వైద్యులను సంప్రదించి రెండో తీసుకోవాలని తెలిపారు. కరోనా విషయంలో సొంత వైద్యం, నిర్ణయాలు మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలన్నీ రెండు డోసులవే. కాబట్టి తొలి డోసు తీసుకున్నాక వైరస్ సోకితే... మొదట అనారోగ్యం నుంచి బయటపడాలి. అనంతరం రెండో డోసు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. మొదటి డోసు తర్వాత వ్యాధి నిరోధక శక్తి కాస్త పెరుగుతుందని అంటున్నారు. భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ సమర్థవంతమైన ఫలితాలు ఇస్తోందని అన్నారు. కొవిషీల్డ్ 48 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని వివరించారు. మొదటి డోసు తర్వాత కరోనా సోకినా మరణాల రేటు చాలా తక్కువగా ఉందని తెలిపారు. టీకా తీసుకున్నా మాస్కు ధరించడం, భౌతిక దూరం పాటించడం మరవొద్దని సూచిస్తున్నారు.
Tags:    

Similar News