డిసెంబ‌రు 7 సెల‌వుపై ఫుల్ క్లారిటీ!

Update: 2018-11-30 04:47 GMT
ఎప్పుడా.. మ‌రెప్పుడా అన్న‌ట్లుగా అంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న రోజు వారానికి వ‌చ్చేసింది. గ‌డిచిన మూడు నెల‌లుగా తెలంగాణ రాష్ట్రంలో పొలిటిక‌ల్ హీట్ ను ఎక్క‌డికో తీసుకెళ్లిన సెమీఫైన‌ల్స్ కు మ‌రో ఎనిమిది రోజులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. ఇవాళ మీరీ వార్త‌ను చ‌దివే స‌మ‌యానికి స‌రిగ్గా వారం త‌ర్వాత ఇదే రోజున (శుక్ర‌వారం) మీరు ఓటు వేసేయ‌ట‌మే కాదు.. తుది ఫ‌లితంపై పెద్ద ఎత్తున విశ్లేష‌ణ‌లు విన‌టం ఖాయం.

ఎన్నిక‌ల ప‌ర్వంలో అత్యంత కీల‌క‌మైన పోలింగ్ రోజున సెల‌వు ఉందా?  లేదా? అన్న‌ది ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌గా మారింది. ఎందుకంటే.. హైద‌రాబాద్‌లోని వేలాది ఐటీ కంపెనీలు ఆ రోజున ప‌ని చేస్తున్నాయి. అదేమంటే.. తమ‌కు అమెరికా.. కెన‌డా.. యూరోపియ‌న్ దేశాల‌తో పాటు.. మ‌ధ్య ప్రాచ్యంలోని దేశాల‌తో తాము ఒప్పుకున్న కాంట్రాక్ట్స్ లో భాగంగా ఆ రోజున ప‌ని చేసి తీరాల‌ని వారు చెబుతున్నారు.

దీంతో.. డిసెంబ‌రు 7 సెల‌వు లేదన్న ప్ర‌చారం జోరుగా సాగుతోంది. ఇలాంటి వేళ తెలంగాణ ఎన్నిక‌ల సంఘం ప్ర‌ధానాధికారి తాజాగా క్లారిటీ ఇచ్చేశారు. తాజాగా సెక్ర‌టేరియ‌ట్‌లో జ‌రిగిన స‌మావేశంలో మాట్లాడిన ఆయ‌న‌.. డిసెంబ‌రు 7న ఓట‌ర్లంతా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవాల‌ని కోరారు.

ఎవ‌రేం చెప్పినా.. డిసెంబ‌రు 7న వేత‌నంతో కూడిన సెల‌వుగా ప్ర‌క‌టించారు. ఇందులో ఎలాంటి అనుమానాల‌కు తావు లేద‌న్నారు. పోలింగ్ రోజున ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఓట‌ర్ల‌కు స్లిప్పుల పంపిణీని మ‌రింత వేగంగా జ‌రిగేలా ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు చెప్పారు. బ్యాలెట్ పేప‌ర్ల ముద్ర‌ణ ఈ రోజు (న‌వంబ‌రు 30) పూర్తి కానున్నట్లు చెప్పారు. పోలింగ్‌ లో కీల‌క‌మైన ఈవీఎంలు.. వీవీ ప్యాట్ యంత్రాల్ని సిద్ధం చేసిన వైనాన్ని ప్ర‌స్తావించారు.

ఎన్నిక‌ల్లో ఓటు వేయ‌టానికి ప‌లువురికి ఎదుర‌య్యే ఇబ్బందుల్లో ప్ర‌ధాన‌మైంది.. త‌మ ఓటు ఏ పోలింగ్ స్టేష‌న్లో ఉన్న‌ద‌న్న సందేహాన్ని తీర్చేందుకు ఎన్నిక‌ల సంఘం తాజాగా నా వోట్ యాప్ ను త‌యారు చేసింది. దీన్ని ఉప‌యోగించ‌టం చాలా ఈజీ. అండ్రాయిడ్‌.. ఐవోఎస్ వెర్ష‌న్ల‌లో అందుబాటులో ఉండే ఈ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకుంటే.. పోలింగ్ స్టేష‌న్ ఎక్క‌డ ఉంద‌న్న‌ది చాలా ఈజీగా గుర్తించొచ్చు.

అదెలానంటే.. ఈ యాప్ ను ఓపెన్ చేసి పేరు కానీ.. ఎపిక్ నెంబ‌రును టైప్ చేసిన వెంట‌నే ఓట‌రుకు స‌మీపంలో ఉండే పోలింగ్ బూత్ అధికారుల వివ‌రాలు ప్ర‌త్య‌క్షం కానున్న‌ట్లు చెబుతున్నారు. సో.. ఇక్క‌డ క్లారిటీగా చెప్పుకోవాల్సిన అంశాలు రెండు.. అందులో మొద‌టిది.. పోలింగ్ రోజైన డిసెంబ‌రు 7న వేత‌నంతో కూడిన సెల‌వు. రెండోది.. ఓటు ఏ పోలింగ్ స్టేష‌న్లో ఉందో తెలుసుకోవ‌టానికి మొబైల్ యాప్‌. మ‌రిన్ని సౌక‌ర్యాలు ఉన్న వేళ‌.. పౌరులంతా త‌మ‌కున్న విచ‌క్ష‌ణ‌తో పెద్ద ఎత్తున ఓటు వేయాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ అవ‌కాశం ఇప్పుడు మిస్ అయితే.. ఐదేళ్ల పాటు ప్ర‌జ‌ల మీద పాల‌కులు స్వారీ చేస్తార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోవ‌ద్దు.


Tags:    

Similar News