ఆ స‌మీక్ష‌ల‌ను సీఎం జ‌గ‌న్ ఆపేసినట్టేనా?

Update: 2022-08-19 07:34 GMT
ఏపీలో వచ్చే ఎన్నిక‌ల్లో మ‌రోసారి అధికారంలోకి రావ‌డ‌మే ల‌క్ష్యంగా వైఎస్సార్సీపీ వ్యూహ‌, ప్ర‌తివ్యూహాల‌తో సిద్ధ‌మ‌వుతోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో 175కి 175 సీట్లు సాధించాల‌ని ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ త‌న పార్టీ నేత‌ల‌కు ఇప్ప‌టికే దిశానిర్దేశం చేశారు. మ‌రోవైపు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేలు లేనిచోట నియోజ‌క‌వ‌ర్గాల ఇన్‌చార్జులు గ‌డ‌ప గ‌డ‌ప‌కు మ‌న ప్ర‌భుత్వం కార్య‌క్ర‌మం పేరుతో నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ర్య‌టిస్తున్నారు.

మ‌రోవైపు సీఎం వైఎస్ జ‌గ‌న్ కూడా నియోజ‌క‌వ‌ర్గాల‌వారీగా ఒక్కో నియోజ‌క‌వ‌ర్గం నుంచి 50 మంది కార్య‌క‌ర్త‌ల‌ను తాడేప‌ల్లిలోని త‌న క్యాంప్ ఆఫీసుకు పిలిపించి మాట్లాడుతున్నారు. అయితే ఈ కార్య‌క్ర‌మం దాదాపు రోజూ ఉంటుంద‌ని మొద‌ట వార్త‌లు వ‌చ్చాయి. అయితే ఇప్ప‌టివ‌ర‌కు సీఎం జ‌గ‌న్ రెండు నియోజ‌క‌వ‌ర్గాల కార్య‌క‌ర్త‌ల‌తోనే మాట్లాడారు.

మొద‌ట టీడీపీ అధినేత‌, ఏపీ ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం నియోజ‌క‌వ‌ర్గంపై దృష్టిపెట్టారు.. వైఎస్ జ‌గ‌న్. కుప్పంలో ఇప్ప‌టికే పంచాయ‌తీ, మండ‌ల‌, జిల్లా ప‌రిష‌త్లు, మున్సిపాలిటీని కైవ‌సం చేసుకుని టీడీపీకి షాక్ ఇచ్చారు. ఈ నేప‌థ్యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును ఓడించాల‌ని కంక‌ణం క‌ట్టుకున్నారు. ఈ నేప‌థ్యంలో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎంపిక చేసిన 50 మంది క్రియాశీల‌క కార్య‌క‌ర్త‌ల‌తో సీఎం జ‌గ‌న్ మొద‌టి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. పులివెందుల త‌ర్వాత త‌న‌కు రెండో నియోజ‌క‌వ‌ర్గం కుప్ప‌మ‌ని తేల్చిచెప్పారు. కుప్పంలో ఈసారి భ‌ర‌త్‌ను గెలిపించాల‌ని కోరారు.

కుప్పం త‌ర్వాత ఇక జిల్లాల‌వారీగా ఉత్త‌రాంధ్ర నుంచి స‌మీక్ష‌లు మొద‌లుపెట్టారు. ఈ క్ర‌మంలో శ్రీకాకుళం జిల్లాలోని రాజాం నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన 50 మంది కార్య‌క‌ర్త‌ల‌తో సీఎం జ‌గ‌న్ మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు పాల్గొన్నారు.

ఇక ఈ రెండు (కుప్పం, రాజాం) నియోజ‌క‌వ‌ర్గాల త‌ర్వాత మ‌ళ్లీ సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌లు ఆపేశారు. దీంతో ఎమ్మెల్యేలు, ముఖ్యం కార్య‌క‌ర్త‌లు నిరాశ చెందుతున్నార‌ని అంటున్నారు. అప్పుడెప్పుడో పాద‌యాత్ర త‌ర్వాత నేరుగా సీఎం జ‌గ‌న్‌ను క‌లిసే అవ‌కాశం వ‌చ్చింద‌ని.. అయితే ఆదిలోనే హంస‌పాదులా రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌తోనే సీఎం జ‌గ‌న్ స‌మీక్ష‌లు ఆపేశార‌ని నిరాశ చెందుతున్నార‌ని టాక్.

మ‌రోవైపు ఎమ్మెల్యేలు కూడా సీఎం జ‌గ‌న్ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన‌ప్పుడు ఆయ‌న‌ను క‌ల‌వ‌డం లేదంటే ఏదైనా ముఖ్య‌మైన కార్య‌క్ర‌మాలు ఉంటే అపాయింట్‌మెంట్ తీసుకుని క‌ల‌వ‌డం త‌ప్ప సీఎంను క‌లిసే చాన్సు రావ‌డం లేద‌నే ఆవేద‌న‌లో ఉన్నట్టు టాక్ న‌డుస్తోంది. ఇప్పుడు నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌ల పుణ్య‌మా అని సీఎంను క‌లిసి త‌మ అభిప్రాయాలు చెప్పేందుకు ఆశ‌పడితే.. సీఎం రెండు నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌ల‌తోనే స‌రిపెట్టార‌ని బాధ‌ప‌డుతున్న‌ట్టు చెబుతున్నారు.

అయితే సీఎం జ‌గ‌న్ గ‌త కొద్ది రోజులుగా వేర్వేరు కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉండ‌టం, త‌దిత‌ర కార‌ణాల‌తో తాత్కాలికంగా స‌మీక్ష‌ల‌కు విరామ‌మిచ్చార‌ని అంటున్నారు. త్వ‌ర‌లోనే రాష్ట్రంలో మిగిలిన 173 నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష‌లు ఉంటాయ‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News