స్మార్ట్ ఫోన్ ఎంత డేంజరో చెప్పారు..

Update: 2019-06-24 12:27 GMT
తెలుగులో వచ్చిన బొమ్మరిల్లు సినిమా చూశారా.? అందులో అల్లరి పిల్ల హీరోయిన్ జెనిలీయో ఎవరికైనా తల పొరపాటున తగిలితే కొమ్ములొస్తాయని మళ్లీ తలతో గుద్దుతుంటుంది. అది సినిమా వరకే ఫన్నీగా పరిమితమైంది.  ఇది ఒట్టి నమ్మకమే అయినా ఇప్పుడు నిజంగానే నిజం కాబోతోంది. కాకపోతే అదీ సెల్ ఫోన్ల పుణ్యమానీ.. మనిషికి కొమ్ములొస్తున్నాయి.. ఇది నిజంగా నిగ్గుతేల్చిన నిజం.

అవును సెల్ ఫోన్లు అదే పనిగా తదేకంగా చూసే వారికి హెచ్చరిక లాంటి వార్తను చెప్పారు ఆస్ట్రేలియా పరిశోధకులు. సెల్ ఫోన్ లు ఎక్కువగా వాడే వారికి కొమ్ములొస్తాయి.. వారి పుర్రె ఎముకలు పైకి వస్తాయని పరిశోధనలో తేల్చారు.

ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ ద సన్ షైన్ కోస్ట్ లో హెల్త్ సైంటిస్ట్ గా పనిచేస్తున్న డేవిడ్ షహర్, ఆయన సహచరుడు మార్క్ సేయర్స్ ఈ పరిశోధన చేశాడు. తాజాగా ప్రముఖ మీడియా సంస్థ బీబీసీ ఈ కథనాన్ని ప్రచురించింది. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. కొమ్ములు వచ్చిన స్కానింగ్ రిపోర్టులను బయటపెట్టి మరీ వివరించారు. దీంతో  సెల్ ఫోన్ వాడే వాళ్లందరూ షాక్ అవుతున్నారు. ప్రస్తుతం వార్త వైరల్ గా మారుతోంది.

మెడ భాగాన్ని ఎక్కువ సేపు వంచి సెల్ పోన్ చూడడం వల్ల అక్కడి కండరాలపై అదనపు ఒత్తిడి పడి పుర్రె వెనుక దిగువ భాగంలో ఎముకలు పెరుగుతున్నాయని ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు. 18 నుంచి 30 ఏళ్ల వారిలో ఎక్కువగా ఇది కనిపిస్తోందని నిరూపించారు.

మొత్తం 218 మంది 30 ఏళ్లలోపు వారిని పరిశోధించగా ఇందులో 41శాతం మంది పుర్రె వెనుక భాగంలో ఎముక పెరుగుదల కనిపించింది. దీన్ని వైద్య పరిభాషలో ఎంతియోసోఫైట్స్ అంటారు.  కొందరికి 1.1 అంగుళాల మేర ఎముకు పెరగడం గమనార్హం.  స్మార్ట్ ఫోన్ విప్లవం మొదలైనప్పటి నుంచి ఈ ఎముక పెరుగుదల ఎక్కువైందని పరిశోధనలో తేలింది.

అయితే ఈ తరహా ఎముకుల పెరుగుదల సాధారణమైన విషయమేనని బ్రిటీష్ మెడియకల్ జర్నల్ తెలిపింది. పుర్రె వెనుక భాగంతోపాటు తల నుంచి కాలివేళ్ల దాకా ఎముకలు పెరుగుతాయని స్పష్టం చేసింది. ఇది ప్రమాదమేమీ కాదని.. మన అస్తవ్యస్త స్మార్ట్ ఫోన్ చూసే భంగిమల వల్ల ఇలా ఎముకలు పెరిగి మెడనొప్పికి కారణమవుతాయని వివరించింది. సో స్మార్ట్ ఫోన్ యూజర్లు మీరు అదే పనిగా చూస్తే మాత్రం మీకు నిజంగా కొమ్ములు రావడం మాత్రం ఖాయం.
Tags:    

Similar News