వైఎస్ చిత్రపటంపై చెప్పులు వేశారు..

Update: 2016-07-09 06:50 GMT
దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి అంటే వైసీపీ అభిమానుల్లోనే కాదు, ఇతర సామాన్య ప్రజల్లోనూ అభిమానం ఉంది. రాజకీయ నేతగా మెరుపులు - మరకలు రెండూ ఉన్న వైఎస్ ను అమితంగా అభిమానించేవారు, తీవ్రంగా వ్యతిరేకించేవారూ ఉన్నారు. అయితే... వైఎస్ జీవించిన కాలంలో ఆయన ఇతర నేతలను అవమానించడమే కానీ, ఆయన అవమానాలను గురయిన ఘటనలు దాదాపు లేవనే చెప్పాలి. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబును అవమానించేలా వైఎస్ పలుమార్లు మాట్లాడిన సందర్భాలున్నాయి. అలాగే వైఎస్ సీఎం కావడానికి ముందు కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రులపైనే చెప్పులు వేయించారన్న ఆరోపణలున్నాయి. అయితే... ఆయన సీఎం అయిన తరువాత ఆయన పట్ల ఉన్న అభిప్రాయం చాలావరకు మారిపోయింది. విపరీతమైన ప్రజాభిమానాన్ని సంపాదించుకోగలిగారు.

అలాంటి ప్రజాభిమానం పొందిన వైఎస్ అకాల మరణంపొందినా ఇంకా జనం మదిలో ఉన్నారు. కానీ.. తాజాగా వైఎస్ జయంతి రోజునే ఆయనకు అవమానం జరిగింది. అది కూడా వైసీపీ నేతల నుంచే అవమానం జరిగింది. అవమానమంటే మామూలుగా కాదు.. ఏకంగా వైఎస్ చిత్రపటంపై చెప్పులు పడ్డాయి. అవును.. వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు చెప్పులు - కుర్చీలు విసురుకుంటే అవన్నీ వైఎస్ చిత్రపటం పైనే పడ్డాయి.  వైసీపీలోని చెన్నై సేవాదళం నేతల మధ్య నెలకొన్న వివాదం దీనికి కారణమైంది. ఆధిపత్య పోరులో భాగంగా ఇరువర్గాలుగా విడిపోయిన కార్యకర్తలు చెప్పులు - బూట్లతో కొట్టుకున్నారు. ఈ క్రమంలో వారు విసురుకున్న చెప్పులు ఏకంగా వైఎస్ చిత్రపటంపై పడినా వారు పట్టించుకోలేదు.

 చెన్నై సేవాదళానికి అధికార ప్రతినిధి అయిన సైకం రామచంద్రారెడ్డిని ఇటీవల ఆ పదవి నుంచి తొలగించారని, తనను ఆ పదవిలో నియమించారని లక్ష్మీశ్రీదేవిరెడ్డి ప్రచారం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో నిన్న వైఎస్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు నివాళి అర్పించేందుకు చెన్నైలో ఏర్పాటైన కార్యక్రమంలో సైకం - శ్రీదేవిరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. రెండు వర్గాల వారు  పరస్పరం దాడులు చేసుకున్నారు.  చెప్పులు - బూట్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వారు విసిరిన చెప్పులు అక్కడే ఏర్పాటు చేసిన వైఎస్ చిత్రపటంపై పడ్డాయి. వారు మాత్రం తమ గొడవలో తాము ఉన్నారు కానీ వైఎస్ కు జరిగిన అవమానాన్ని పట్టించుకోలేదు.
Tags:    

Similar News