టీడీపీలో అసంతృప్త జ్వాలలు..

Update: 2019-03-01 04:59 GMT
కడప జిల్లా టీడీపీలో కొత్త సమస్యలు వస్తున్నాయి. ఇక్కడి గ్రూపు రాజకీయాలు అధిష్టానానికి కొత్త తలనొప్పిగా మారాయి. ఈ నేపథ్యంలో కమలాపురం నియోజకవర్గంలో పుత్తా, వీరశివారెడ్డి వర్గాల మధ్య వైరం  కొత్త సెగలు రేపుతోంది. నియోజకవర్గం ఇన్‌ చార్జిగా ఉన్న పుత్తా నర్సింహారెడ్డికి టీడీపీ టికెట్‌ కేటాయించింది. దీంతో చివరి వరకు ప్రయత్నించిన వీరశివారెడ్డి పుత్తాకు టికెట్‌ ఇవ్వడం సహించుకోలేకపోతున్నారట. ఈ పంచాయతీని అధిష్టానం వద్దకు తీసుకెళ్లిన వీరశివారెడ్డి ఆ తరువాత ఏం చేయబోతున్నాడోనన్న ఆసక్తి తెలుగు తమ్ముళ్లలో నెలకొంది.

2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన పుత్తా నర్సింహారెడ్డి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు నియోజకవర్గ ఇన్‌ చార్జిగా కూడా ఆయనే ఉన్నారు. గత ఎన్నికల ముందు టీడీపీలో చేరిన వీరశివారెడ్డికి పుత్తా నర్సింహారెడ్డికి రాజకీయ వైరం స్ట్రాంగ్‌ గానే ఉంది. అయినా గత ఎన్నికల్లో నర్సింహారెడ్డికి వీరశివారెడ్డి మద్దతు పలికారు. కానీ టీడీపీ ఓటమి తప్పలేదు. ఇప్పుడు కమలాపురం టికెట్‌ కోసం ఎవరి ప్రయత్నాలు వారే చేశారు. కానీ పార్టీ అధిష్టానం మాత్రం పుత్తా వైపే మొగ్గు చూపింది. దీంతో వీర శివారెడ్డి ఆగ్రహంతో ఊగిపోతున్నారట.

వాస్తవానికి కమలాపురం నియోజకవర్గ టికెట్‌ పై ఈ ఇద్దరు నేతల మధ్య బెట్టింగులు కూడా సాగాయి. ఇరువురి నేతల అనుచరులు బెట్టింగ్‌ లు పెట్టి తమ నేతకే టికెట్‌ వస్తుందని ప్రచారం చేసుకున్నారు. కోట్ల రూపాయల్లో ఈ బెట్టింగ్‌ లు సాగడం విశేషం. అయితే ఈ పోటీలో పుత్తా పై చేయి సాధించారు. అయితే తాడో పేడో తేల్చుకోవడానికి వీరశివారెడ్డి అధిష్టానం వద్దకు వెళ్లారట. గత ఎన్నికల్లో తాను మద్దతు ఇచ్చినా నర్సింహారెడ్డి గెలవలేదని, ఇప్పుడు నా మద్దతు లేకుండా ఎలా గెలుస్తారో చూస్తానని వీర శివారెడ్డి చెబుతున్నారట.

మంత్రి ఆది నారాయణరెడ్డికి, వీరశివారెడ్డికి మధ్య రాజకీయ వైరం ఉంది. ఈ నేపథ్యంలోనే తనకు టికెట్‌ రాకుండా అడ్డుకున్నారని ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారట. దీంతో టికెట్‌ విషయంలో మరోసారి ఆలోచించాలని వీరశివారెడ్డి అధిష్టానం వద్దకు వెళ్లి అడగనున్నట్లు తెలుస్తోంది. అయితే ఒకసారి టికెట్‌ కేటాయించిన తరువాత మరోసారి మార్చేందుకు బాబు సుముఖత లేడట. ఈ విషయంలో వీరాశివారెడ్డి ఎలా స్పందిస్తాడోనని తెలుగు తమ్ముళ్లలో తీవ్ర ఆసక్తి రేపుతుందట. టీడీపీకి అత్యంత కీలకమైన వైఎస్ జగన్ ఇలాకాలో ఈ అసంతృప్త జ్వాలలు పార్టీ పుట్టి ముంచుతాయని టీడీపీలో ఆందోళన వ్యక్తమవుతోంది.
    

Tags:    

Similar News