భారతీయులకు ఇమ్యూనిటీ 'పవర్'ఎక్కువగా ఉందా..!

Update: 2022-12-15 16:30 GMT
కరోనాను ప్రపంచానికి పరిచయం చేసిన దేశం చైనా. ఈ మహమ్మారి కారణంగా యావత్ ప్రపంచం ఎంతలా స్తంభించిపోయిందో అందరికీ తెల్సిందే. కరోనా వైరస్ మానవ నిర్మితమైందనీ.. చైనా నిర్లక్ష్యం కారణంగానే యావత్ ప్రపంచం మూల్యం చెల్లించుకుందనే వాదనలు ఇటీవల తరుచూ వినిపిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలను చైనా ఎంత మాత్రం ఒప్పుకోవడం లేదు.

అయితే చైనా ప్రవర్తన చూస్తుంటే మాత్రం కరోనా వ్యాప్తికి ఆ దేశమే కారణమేనని అర్థమవుతోంది. కరోనా ఫస్ట్ వేవ్.. సెకండ్.. థర్ఢ్ వేవ్.. ఫోర్త్ వేవ్ లను ప్రపంచ దేశాలు చవిచూశాయి. కరోనాకు వ్యాక్సిన్ రావడంతో పాటు వైరస్ వేరియంట్లు క్రమంగా తమ ప్రభావం కోల్పోవడంతో ప్రస్తుతం కరోనా కేసులు ప్రపంచ వ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి.

కరోనా ఫస్ట్ వేవ్ ను సమర్థంగా ఎదుర్కొన్న చైనా మాత్రం ప్రస్తుతం కట్టడి చేయలేక చేతులెత్తేసింది. జీరో కోవిడ్ విధానంతో ప్రజలను ఇళ్ళల్లో.. పనిచేసే ప్రదేశాల్లో ఐసోలేట్ చేస్తుంది. నెలల తరబడి ఈ విధానాన్ని కొనసాగిస్తుండటంతో ఆ దేశ పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో కరోనా కట్టడి చైనాలో ఇప్పట్లో కట్టడి అయ్యే అవకాశం కనిపించడం లేదు.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. భారత్ లోనూ కరోనా పూర్తి స్థాయిలో కట్టడి కావడంతో ప్రజలంతా మునుపటిలా మాస్కులు లేకుండానే రోడ్లపై తిరుగుతున్నారు. సినిమాలు.. షికార్లు.. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజలంతా కోవిడ్ టీకాలు వేయించుకోవడంతో కరోనా కేసులు నమోదైన త్వరగా భారతీయులు రికవరీ అవుతున్నారు.

ఈ విషయంపై ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ అధ్యక్షురాలు చంద్రిమా షాహ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. యూరప్.. ఇతర దేశాలతో పోలిస్తే భారతీయులకు ఇమ్యూనిటీ పవర్ (రోగ నిరోధక శక్తి ) ఎక్కువని తెలిపారు. ఈ కారణంగానే భారతీయులు కరోనా బారిన పడినప్పటికీ త్వరగానే రికవరీ అయ్యారని పేర్కొన్నారు.

అయితే చైనా వ్యాప్తంగా పెరుగుతున్న కేసులతో భారత్ కు ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. భారత్ లో మెజారిటీ ప్రజలంతా ఇప్పటికే కరోనా టీకాలను వేయించుకోవడంతో ప్రాణపాయ స్థితి ఉండే పరిస్థితులు లేవని స్పష్టం చేశారు. భారతీయులు మానసికంగా ఎంతో దృఢంగా ఉండడం వల్లే వారిలో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటానికి కారణమని పలువురు పరిశోధకులు గతంలోనే వెల్లడించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News