దళితబంధులో డిమాండ్ ఎక్కువ దేనికో తెలుసా?

Update: 2021-09-23 08:35 GMT
వినూత్న పథకాలకు.. ఊహకు అందని రీతిలో సంక్షేమ కార్యక్రమాల్ని చేపట్టటంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. ఆలోచనల్లోనే అసాధ్యమనిపించే అంశాల్ని టేకప్ చేసి.. దానికి తనదైన మసాలా దట్టించి.. కార్యక్రమాల్ని చేపట్టటం ద్వారా ఆయన తరచూ వార్తల్లో నిలవటమే కాదు.. ఇలాంటి పథకాల అమలు ఎలా సాధ్యం బాస్ అన్న భావనను ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కలిగేలా చేస్తుంటారు. దళితులకు రూ.10లక్షల మొత్తాన్ని ఇచ్చేసి.. వారికి నచ్చిన వ్యాపారాన్ని చేపట్టేందుకు వీలుగా ‘దళితబంధు’ కార్యక్రమాన్నిచేపట్టటం తెలిసిందే.

ఈ పథకానికి ఎంపిక చేసిన లబ్థిదారుల్లో ఎక్కువ మంది ఎలాంటి వ్యాపారాన్ని కోరుకుంటున్నారు? వేటిని కొనటానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తున్నారన్న అంశానికి సంబంధించిన వివరాలు తాజాగా బయటకు వచ్చాయి. ఎంపిక చేసిన లబ్థిదారుల్లో 70 శాతం మంది కార్లు.. ట్రాక్టర్లు కొనేందుకు ఎక్కువగా ఆసక్తిని చూపుతున్నట్లు చెబుతున్నారు. కార్లు.. ట్రాక్టర్లను కొనటం.. అయితే అద్దెకు ఇవ్వటం.. లేదంటే సొంతంగా నడుపుతామని చెబుతున్నారు.

ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా హుజూరాబాద్ నియోజకవర్గంలో అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం కోసం ఇప్పటికే రూ.2వేల కోట్లను విడుదల చేసింది. 2014లో రాష్ట్ర ప్రభుత్వం చేసిన సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం.. నియోజకవర్గంలో దాదాపు 20 వేల మంది ఎస్సీ కుటుంబాలు ఉన్నాయి. దళితబంధు కోసం లెక్కలు వేయగా.. అవి కాస్తా 25వేల కుటుంబాలు ఉన్నట్లుగా తేలింది.

ఇప్పటివరకు 18వేల కుటుంబాలకు రూ.10లక్షల చొప్పున నిధులు జమ అయినట్లుగా తెలుస్తోంది. వీరిలో ఎక్కువ మంది కార్లు.. ట్రాక్టర్లు కోరుకుంటున్నట్లుగా గుర్తించిన అధికారులు.. అందరూ వాటినే కోరుకుంటే.. డిమాండ్ తగ్గి ఆదాయం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. అందుకే.. ఈ రెండు కాకుండా.. మిగిలిన ఆదాయ మార్గాల మీద ఫోకస్ చేయాలని కోరుతున్నారు. రానున్న వారం.. పది రోజుల్లో అర్హత ఉన్న దళిత కుటుంబాలన్నింటికి రూ.10లక్షల చొప్పున నగదును వారి ఖాతాల్లో జమ చేస్తారని చెబుతున్నారు.




Tags:    

Similar News